సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : బుద్ధ పౌర్ణిమ ప్రాజెక్టు అధికారులకు హెచ్ఎండీఏ నిబంధనలు వర్తించేలా లేవు. గతంలోనూ ఎన్నడూ లేని విధంగా పార్కింగ్ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ విధానంలో టెండర్లను కట్టబెట్టి వివాదానికి తెరలేపారు. ఆ తర్వాత వచ్చిన ఆరోపణల నేపథ్యంలో హుస్సేన్ సాగర్ వెంబడి ఉన్న పార్కింగ్ స్థలాలను టెండర్లను ఆహ్వానించి, కట్టబెట్టారు. కానీ ఒకసారి టెండర్ ప్రక్రియ మొదలుపెట్టి, పూర్తయ్యేంత వరకు హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం పార్కింగ్ వసూలు కార్యాకలాపాలు నిలిపివేయాలి.
కానీ నామినేషన్ విధానంలో అప్పటికే కట్టబెట్టిన ఆ సంస్థనే యథేచ్ఛగా వాహనదారుల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయడం ఇప్పుడు బీపీపీ అధికారులకు సర్వసాధారణంగా కనిపిస్తున్నది. ఈ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, నిబంధనల ప్రకారమే పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు అధికారులు చెప్పుకోవడం విడ్డూరం. బీపీపీ పరిధిలో మూడేండ్ల కాలం పాటు పార్కింగ్ స్టాండ్ నిర్వహణకు లైసెన్స్ మంజూరు చేసి, ఎన్టీఆర్ ఘాట్, సంజీవయ్య పార్క్, అంబేద్కర్ విగ్రహం పక్కన, సంజీవయ్య పార్క్ వద్ద ఒక ఎకరం విస్తీర్ణంలో పార్టీలు, అమ్యూజ్మెంట్, కన్వెన్షన్, ఈవెంట్ సౌకర్యాల స్థాపన, నిర్వహణకు అవసరమైన టెండర్లను గత నెలల్లో పూర్తి చేశారు.
ఆగని వసూళ్లు..
టెండర్లు పిలవగానే.. అప్పటివరకు నిర్వహిస్తున్న కార్యాకలాపాలు నిలిపివేయాల్సి ఉంటుంది. కానీ అధికారులు అవేం పట్టించుకోకుండా, ఓవైపు టెండర్లు ఖరారు కానున్నా.. అడ్డగోలుగా వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ విషయంలో మెట్రోపాలిటన్ కమిషనర్ వారికి టెండర్లును కట్టబెట్టారని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. కొత్త ఏజెన్సీ వచ్చేంత వరకు ఆయా పార్కింగ్ స్థలాల్లో ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదనే నిబంధన కూడా ఉంది. గత 15 ఏండ్లుగా ఇదే తీరుగా పార్కింగ్ వ్యవహారం నడుస్తుండగా.. ఈ ఏడాదిలోనే నిబంధనలను పట్టించుకోకుండా, నామినేషన్ విధానంలో కట్టబెట్టిన సంస్థకు వసూలు చేసుకునే అధికారాన్ని కట్టబెట్టారు. దీంతో ట్యాంక్ బండ్‌కు పైకి వచ్చే వేలాది వాహనదారుల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తూనే ఉన్నారు. గత నెలల్లోనే టెండర్ల ప్రక్రియ ముగిసింది. కానీ అగ్రిమెంట్లు పూర్తి కాలేదు. కొత్త ఏజెన్సీలు వచ్చేంత వరకు పార్కింగ్ ఫీజు వసూలు చేయవద్దు. కానీ బలవంతంగా వాహనదారుల నుంచి పిండుకుంటూనే ఉన్నారు.
పెద్దమ్మగుడిలో పార్కింగ్ దందా
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడిలో పార్కింగ్ దందా జోరుగా సాగుతోంది. నిత్యం వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. వారివద్ద నుంచి ప్రైవేటు వ్యక్తులు పార్కింగ్ ఫీజులను వసూలు చేస్తున్నారు. దేవాదాయశాఖ నిబంధనల ప్రకారం ఆలయాల్లో పార్కింగ్ ఫీజు వసూలు చేయాలంటే బహిరంగ వేలం ద్వారా టెండర్లు దక్కించుకున్న తర్వాతే చేయాల్సి ఉంటుంది. అయితే నిబంధనలను తుంగలో తొక్కిన ప్రైవేటు వ్యక్తులు ఆలయానికి నెలకు నామమాత్రంగా సుమారు రూ.15వేల నుంచి రూ.20వేల దాకా చెల్లిస్తూ అడ్డదారిలో లక్షలాది రూపాయలను భక్తుల వద్ద దండుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆటోలు, కార్లకు రూ. 20 చొప్పున, ద్విచక్రవాహనాలకు రూ. 10 చొప్పున వసూలు చేస్తున్నారని, జీహెచ్ఎంసీ పరిధిలోని ఆలయాలు, వ్యాపార సముదాయాల్లో పార్కింగ్ ఫీజులు వసూలు చేయడంపై నిషేధం ఉన్నప్పటికీ జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో మాత్రం ప్రైవేటు వ్యక్తులు పార్కింగ్ ఫీజులు వసూలు చేయడం దారుణమని పలువురు భక్తులు పేర్కొంటున్నారు.