నాంపల్లి కోర్టులు, జూలై 11 (నమస్తే తెలంగాణ): సిద్దిపేటకు చెందిన న్యాయవాది రవికుమార్‌పై ఏఎస్ఐ అకారణంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనను ఖండిస్తూ నాంపల్లి కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. దాడిని ఖండిస్తూ పెద్ద ఎత్తున పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై రోజు రోజుకూ దాడులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో నాంపల్లి కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజ్యవర్ధన్రెడ్డి, కోశాధికారి రామాంజనేయులు, సంయుక్త కార్యదర్శి రమేశ్, సభ్యులు, మహిళా న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.