హైదరాబాద్ : నగరంలోని దూల్పేట్ ప్రాంతంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ (Excise Enforcement) పోలీసులు రూ. 3.50 లక్షల విలువ చేసే 17.1 కేజీల గంజాయి (Ganja) ని పట్టుకున్నారు. లోయర్ దూల్పేట్, మల్సిపూర్ ప్రాంతంలో గంజాయిని ప్యాకెట్లుగా చేసి అమ్మకాలు సాగిస్తున్నారన్న సమాచారంతో ఆదివారం ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దాడిచేసి పట్టుకున్నట్లు ఎస్ఎఫ్టీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి (ES Anjireddy) తెలిపారు.
కర్ణాటక ప్రాంతానికి చెందిన సోంపాల్రావు వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేసి చిన్న చిన్న ప్యాకెట్లుగా అమ్మకాలు జరుపుతున్న దినేష్ సింగ్‌ను పట్టుకున్నామని వెల్లడించారు. అతని వద్ద ఉన్న గంజాయిని తూకం వేయించగా 17.1 కిలోలుగా ఉన్నట్లు వెల్లడయ్యిందని వివరించారు. ఈ గంజాయి విలువ రూ. 3.30 లక్షలుగా ఉంటుందని తెలిపారు.
ఈ గంజాయిని పట్టుకున్న ఎస్సై సాయి కిరణ్, హెడ్ కానిస్టేబుళ్లు యాదగిరి రాజు, యాదగిరి, మహేశ్, రజనీకాంత్‌ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ప్రణవీ, సూపరింటెండెంట్ అంజిరెడ్డి అభినందించారు.