సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతిని ప్రభుత్వాలు నిర్మూలించే దిశగా పనిచేయాలని మాజీ ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు సూచించారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కేబీఆర్ పార్కులో అవినీతికి వ్యతిరేకంగా 2కే రన్ నిర్వహించారు. కార్యక్రమాన్ని మాజీ ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు, మాజీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ, రెడ్‌క్రాస్ చైర్మన్ అజయ్ మిశ్రా, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వ్యవస్థాపకుడు రాజేంద్ర పల్నాటి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వర్రె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మన రాష్ర్టాన్ని, దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతిని నిర్మూలించేందుకు ప్రయత్నించాలన్నారు. రాష్ట్రంలో నూతన బాధ్యతలు చేపట్టిన కొత్త ప్రభుత్వం ప్రజల ఆలోచనలకు అనుగుణంగా అవినీతి రహిత సమాజాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. సమాచార హక్కు చట్టంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు మాట్లాడుతూ.. పెరిగిపోతున్న అవినీతికి రాజకీయ వ్యవస్థే ప్రధాన కారణమని, నేతలు తమ ప్రమాణస్వీకారంలో ధర్మం, న్యాయం గురించి మాట్లాడుతారని, ఆచరణలో లోపాలు ఎక్కువ ఉంటాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ మీడియా కార్యదర్శి జయరాం, కార్యవర్గ బృందం మారియా, అంథోని, డాక్టర్ ప్రతిభాలక్ష్మి, డాక్టర్ నూరి ఫరి, సంతోషిణి, కొన్నె దేవేందర్, బత్తిని రాజేశ్, వరికుప్పల గంగాధర్, కొమటి రమేశ్‌బాబు, ముడావత్ రమేశ్‌నాయక్, శ్రీలేఖ, ఈశ్వర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి, డిసెంబర్ 9: నానక్‌రాంగూడ ఐటీ కారిడార్‌లోని ప్రముఖ ఐటీ సెజ్ వేవ్‌రాక్‌లో ‘వేవ్న్’్ర ఐదో ఎడిషన్ శనివారం ఉత్సాహంగా సాగింది. రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 3కే, 5కే, 10కే విభాగాల్లో నిర్వహించిన ఈ ప్రత్యేక రన్లో వేక్రాక్ ఐటీ పార్క్‌కు చెందిన దాదాపు 3వేల మంది ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వేక్రాక్ సీనియర్ డైరెక్టర్ కల్నల్ సంజయ్ భరద్వాజ్‌తో పాటు వివిధ సంస్థలు ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు.