సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న స్ట్రాటజిక్ నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) తొలి విడత ఫలాలు విడతల వారీగా అందుబాటులోకి వస్తున్నాయి. రూ.985.45కోట్ల పనులు ఒకటి, రెండు చోట్ల మినహా దాదాపుగా 85శాతం మేర పూర్తయ్యాయి. జీహెచ్ఎంసీ, శివారులు కలిపి 57 చోట్ల పనులకుగాను 3 చోట్ల పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. 43 చోట్ల పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెలాఖరులోగా చార్మినార్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ జోన్ల పరిధిలో ఏడు చోట్ల అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో 17, నెలాఖరున మరో 15 చోట్ల అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. హుస్సేన్‌సాగర్ సర్ఫ్లస్ నాలా, బుల్కాపూర్ నాలా పనులను భూసేకరణ ప్రక్రియ కారణంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయడం సాధ్యం కాదని, ఆగస్టు నాటికి పూర్తి చేసి మొదటి విడత పథకాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ నెలాఖరులోగా గుర్రం చెరువు వద్ద కల్వర్టు, అలుగు నిర్మాణం, పల్లె చెరువు తూము, అలుగు నిర్మాణం పనులు పూర్తికానున్నాయి. అప్పా చెరువు వద్ద 550 మీటర్ల పొడవున బాక్స్ డ్రెయిన్, ప్రహరీ నిర్మాణం, అలుగు పునరుద్ధరణ, నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో జరిగిన పనులు తుది దశకు చేరుకున్నాయి. మన్మానికుంట ఫంక్షన్‌హాల్ వరకు 540 మీటర్ల నాలా నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. రాజేంద్రనగర్ ఫిల్లర్ నం.191 దగ్గర పోర్ట్ వ్యూ కాలనీలో చేపట్టిన 860 మీటర్ల నాలా నిర్మాణ పనులు, బాతుల చెరువు, శివం రోడ్డు, వీఎస్టీ కూడలి సమీపంలోని నల్లపోచమ్మ దేవాలయం వద్ద చేపట్టిన కల్వర్టు నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. ఈ నెలాఖరులోగా అందుబాటులోకి రానున్నాయి.