సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ): విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) ప్రత్యేక చర్యలు చేపట్టింది. హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న ప్రాంతాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా విద్యుత్ సరఫరా వ్యవస్థతోపాటు వినియోగదారులకు అంతరాయంలేని సేవలు అందించే దిశగా మొదటి అడుగువేసింది. ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 9 సర్కిళ్లు ఉండగా, కొత్తగా మరో సర్కిల్‌ను కలుపుతూ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో ఉన్న గ్రేటర్ పరిధిలోకి సంగారెడ్డి జిల్లా పరిధిలోని ప్రాంతాలను కలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు సంగారెడ్డి సర్కిల్ పరిధిలో ఎల్టీ విద్యుత్ కనెక్షన్లు మొత్తం 7,91,364 ఉండగా, హెచ్‌టీ కనెక్షన్లు(పరిశ్రమలకు సంబంధించినవి) 2084 వరకు ఉన్నాయి. సంగారెడ్డి సర్కిల్ పరిధిలో సంగారెడ్డితోపాటు పటాన్చెరు, జహీరాబాద్, జోగిపేట డివిజన్లు ఉన్నాయి. వీటన్నింటిని కలిపి సంగారెడ్డి సర్కిల్‌గా ఏర్పాటు చేయగా, ఇప్పటి వరకు డిస్కం పరిధిలోని రూరల్ జోన్లో ఈ సర్కిల్ ఉండేది. దీన్ని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మేడ్చల్ జోన్లోకి మారుస్తూ సీఎండీ ఆదేశాలు జారీ చేశారు.
10 సర్కిళ్లతో గ్రేటర్ హైదరాబాద్..
తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీ ఎస్పీడీసీఎల్) హైదరాబాద్ కేంద్రంగా, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీ ఎన్పీడీసీఎల్) వరంగల్ కేంద్రంగా విద్యుత్ వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి. అయితే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టీజీఎస్పీడీసీఎల్లో 15 సర్కిళ్లు ఉండగా, అందులో 9 సర్కిళ్ల పరిధిలోనే 60-70 శాతం విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. తాజాగా సంగారెడ్డి సర్కిల్‌ను సైతం గ్రేటర్ హైదరాబాద్‌లో కలుపడంతో 10 సర్కిళ్లలో కలిపి మొత్తం 72 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. విద్యుత్ డిమాండ్, ఆదాయం వచ్చే సర్కిళ్లన్నీ ఒకే పరిధిలోకి తీసుకువచ్చి మెరుగైన సేవలందించేందుకు డిస్కం ఉన్నతాధికారుల బృందం నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా గ్రేటర్ చుట్టూ శరవేగంగా పట్టణీకరణ, పారిశ్రామిక కేంద్రాల్లో కొత్త పరిశ్రమలు వస్తుండటంతో విద్యుత్ సరఫరా అత్యంత కీలకంగా మారింది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని 10 సర్కిళ్ల పరిధిలో పరిపాలనా సౌలభ్యం కోసం, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఈ మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.