సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగు రోడ్డు అవతల ఉన్న మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు కల్పించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ప్రత్యేకంగా దృష్టి సారించింది. కీసర నుంచి యాదగిరిగుట్ట వెళ్లే మార్గంలోని బొమ్మలరామారం మండల పరిధి మునీరాబాద్ నుంచి బండకాడిపల్లి, తిమ్మాపూర్ నుంచి నాగాయిపల్లి మీదుగా కర్కపట్ల, మలయాల నుంచి ధర్మారెడ్డి గూడెం వరకు, మైలారం మీది తాండ, తిమ్మాపూర్ నుంచి గద్దిరాలతాండ ప్రాంతాల్లో అవసరమైన చోట సీసీ రోడ్లు, బీటీ రోడ్లను నిర్మించేందుకు హెచ్ఎండీఏ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ.14 కోట్లతో టెండర్ పిలిచారు.
కోర్ సిటీకి దీటుగా శివారు ప్రాంతాలు
రోజురోజుకు నగరం విస్తరిస్తున్నప్పటికీ శివారు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు కల్పించేందుకు నిధుల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ నుంచి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయించడంతో పాటు పనులను పూర్తి చేసేలా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా జీహెచ్ఎంసీ పరిధిలో కాకుండా ఇతర మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు హెచ్ఎండీఏ నుంచి పెద్ద మొత్తంలో నిధులను కేటాయిస్తున్నారు. కోర్ సిటీకి దీటుగా శివారు ప్రాంతాల్లోనూ దశల వారీగా మౌలిక వసతులు కల్పించనున్నారు. హెచ్ఎండీఏ పరిధి గ్రేటర్ చుట్టూ 50 కి.మీ వరకు విస్తరించి ఉండటంతో ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా అటు ప్రజలకు, ప్రభుత్వానికి మేలు చేసేలా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
చకచకా ఎకో పార్కు పనులు
నగర శివారు కొత్వాల్‌గూడలో 80 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండీఏ ఏర్పాటు చేయనున్న ఎకో పార్కులో రహదారుల నిర్మాణ పనులు మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్నాయి. హిమాయత్‌సాగర్ తీరం నుంచి ఔటర్ రింగు రోడ్డును అనుకొని నిర్మిస్తున్న ఈ పార్కు ప్రధాన ద్వారం వరకు అనుసంధాన రహదారి, పార్కింగ్ ప్రదేశం కోసం హెచ్ఎండీఏ అధికారులు ప్రత్యేకంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సుమారు రూ.1.95 కోట్ల వ్యయంతో ఈ పనులను చేపట్టేందుకు ఇటీవల టెండర్లు పిలిచారు. దేశంలోని అతి పెద్ద ఆక్వేరియం, పక్షిశాలలను పార్కులో ఏర్పాటు చేస్తుండటంతో దానికి అనుగుణంగా రోడ్లు, పార్కింగ్ వంటి వసతులను కల్పించనున్నారు. ఔటర్ సర్వీసు రోడ్డు నుంచి పార్కులోకి వెళ్లే ప్రవేశ ద్వారం వరకు విశాలమైన రోడ్డును నిర్మించాలని నిర్ణయించారు. ఈ రెండు పనులను చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లను పిలిచారు. మరో రెండు వారాల్లో పనులను ప్రారంభించనున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.