రంగురంగుల పూలు.. ఆరోగ్యానిచ్చే ఔషధ మొక్కలు.. ఇంటికి ప్రత్యేక కళను తెచ్చే ట్రీ ఆకృతులు.. నోరూరించే ఆర్గానిక్ ఫుడ్స్.. వెరసి నర్సరీ మేళా ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నది. నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో జరుగుతున్న ఈ మేళా ‘స్ట్రెస్ ఫ్రీ జోన్’గా సందర్శకుల్లో నయాజోష్ను నింపుతున్నది. ఈ పచ్చని వనానికి కుటుంబసమేతంగా తరలివస్తున్న నగరవాసులు ప్రతి మొక్కను తిలకిస్తూ మైమరిచిపోతున్నారు. – సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ)
వివిధ స్టాళ్లలో సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు, పండ్లు పండించడం.. ఇందుకు కావాల్సిన పరిజ్ఞానాన్ని అందించేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. ఏ మొక్క ఎన్ని రోజుల్లో పెరుగుతుంది? ఎప్పుడు కోతకు వస్తాయి? ఏ సీజన్లో ఏ పంట వేయాలి? సాంకేతికతను ఎలా వినియోగించాలి? తెగుళ్లకు వాడాల్సిన పురుగుమందులు? ఇలా మొత్తం సమాచారం మేళాలో అందిస్తున్నారు. ట్రే నుంచి మొక్క ఎదిగి పంట వచ్చే వరకు కావాల్సిన సామగ్రి అంతా లభిస్తుంది. టమాటో, కాప్సికమ్, కాలీఫ్లవర్, కర్బూజ, లెట్యూసప్, పార్స్లీ, బ్రకోలి, సెలెరి, ములక్కాడ, బొప్పాయి. బంతి, చామంతి, అరటితో పాటు అన్ని రకాల నారు ఒకే చోట సరసమైన ధరల్లో వినియోగదారులకు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
పెబ్బీస్, గ్రావెల్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ప్లాంట్స్, గ్రాస్, వర్టికల్ గార్డెన్ వాల్స్, హోం అండ్ గార్డెన్ డెకరేటర్స్, స్టోన్ క్రాఫ్ట్స్, ట్రీ ట్రేస్ తదితర ఆకృతుల్లో మొక్కలు పెంచుకోవడానికి వస్తువులు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు రూ.200 నుంచి మూడు వేల వరకు ఉన్నాయి. అంతేకాక ఇండోర్, ఔట్‌డోర్, వాటర్, బోన్సాయ్ లాంటి మొక్కల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా మేళాలో పిట్టగూడు మాదిరిగా ఉన్న కాయర్ పాట్స్ ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. వీటిలో మొక్కలు పెంచడం చాలా సులభమని నిర్వాహకులు వివరిస్తున్నారు.
ఉద్యాన ప్రదర్శనలో సుచితబోన్సాయ్ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ స్టాల్లో వివిధ రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో మొక్క ఖరీదు రూ.5 వందల నుంచి 2.50 లక్షల వరకు ఉన్నాయి. కొండలు, ఫారెస్ట్, ఫాంహౌస్, పురాతన ఇండ్లు.. ఇలా వివిధ ఆకృతుల్లో వీటిని రూపొందించారు. ముఖ్యంగా బుద్ధుడితో ఉన్న సెల్ఫొరా, బ్రిసిలియన్ రెయిన్, రాళ్లతో ఉన్నట్లుగా కనిపించే ఫైకస్ కనువిందు చేస్తున్నాయి. ముఖ్యంగా 90 ఏండ్ల వయసు ఉన్న నటలెన్సెస్ ఖరీదు రూ.2.50లక్షలని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా కర్పూర తులసి, మింట్ తులసి, లవంగ తులసి, కృష్ణతులసి, లక్ష్మితులసి, లెమన్ గ్రాస్ (దోమలు రాకుండా), మ్యాంగో అల్లం తదిరత ఆయుర్వేద మొక్కలను సైతం ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ మొక్కలకు అనేక రోగాలను నయం చేసే శక్తి ఉందని శ్రీనిధి నర్సరీ ఫౌండర్ రాజ్‌కుమార్ తెలిపారు.
నర్సరీ మేళాలో స్నేహాస్టాల్ ప్రత్యేకార్షణగా నిలుస్తున్నది. అత్యధిక సంఖ్యలో సందర్శకులు ఈ స్టాల్‌ను సందర్శిస్తూ అక్కడ ఉన్న ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన మొదటి నర్సరీ కావడం ఓ విశేషమైతే.. అతి తక్కువ ధరల్లో నాణ్యమైన కూరగాయలు, పండ్లు, పూల మొక్కలు లభించడం, సమ్మర్ ఫైటర్ మొక్కలు ఇక్కడ ఉండటం మరో కారణం. ఎండలను తట్టుకొని కనువిందు చేసే లింకా, కోలియస్, డయాంతస్, సాల్వియా, వర్బెనా లాంటి మొక్కలు ఈ స్టాల్లో లభిస్తున్నాయి. ప్రస్తుతం ఈ నర్సరీ రైతులకు నమ్మకమైన మొక్కలను అందిస్తున్నది. అంతేకాక గ్రేటర్‌లోని స్టార్ హోటళ్లు, రెస్టారెంట్స్ ఇండోర్, అవుట్ డోర్ మొక్కలను సైప్లె చేస్తున్నది.
నగరాల్లో ఇప్పుడు చాలా వరకు అపార్ట్మెంట్ కల్చర్ నిండిపోయింది. చాలా మందికి కూరగాయలను ఇంట్లోనే పండించుకుంటే బాగుండని అనిపిస్తుంది. కానీ స్థలాభావంతో కుదరదు. అలాంటి వారి కోసం మేం ప్రత్యేకమైన హైడ్రోస్ను అందుబాటులోకి తెచ్చాం. ఇందులో ఆకుకూరలు పెంచుకోవచ్చు. ఎలాం టి రసాయనాలు అవసరం ఉండదు. సూర్యరశ్మి తగిలే ప్రాంతం, ఇండోర్, గ్రో వాల్ హ్యాంగర్స్ తయారు చేశాం. ఎంచుకున్న స్థలం అనుగుణంగా వాటిని మేం రూపొందించి అందిస్తాం. నీళ్ల అవసరం చాలా తక్కువగా ఉండేలా పైప్స్‌ను డిజైన్ చేశాం.
– ప్రీతి, ఇసాయూ గ్రీన్‌హెల్త్ ఫౌండర్
అంబ్రెల్లా ప్లాంట్, యెల్లొ మనీప్లాంట్, రెడ్ అండ్ బ్లాక్ ఫెలో డెంట్రెండ్, మినీ అలోవెరా, సెన్స్రీవ్ తదితర ఆక్సిజన్ మొక్కలు మేళాలో అందుబాటులో ఉన్నాయి. మహిళా దినోత్సవం, బర్త్‌డే తదితర సెలబ్రేషన్ కోసం బహుమతులుగా అందించేలా అనేక మొక్కలను రూపొందిస్తున్నాం. నిరుపయోగ బాటిళ్లను వినియోగంలోకి తెచ్చే తీసుకొచ్చే ఉద్దేశంతో విభిన్న రకాల ఆర్ట్స్‌తో వాటిలో మొక్కలను ఉంచి రూపొందించాం. ఆక్సిజన్ మొక్కలకు మంచి డిమాండ్ ఉంది. వీటిని పెంచడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. వారానికి ఒక రోజు నీళ్లు పోస్తే సరిపోతుంది. అది కూడా ఒక్క మూత నీళ్లు అంతే. -యూసఫ్ గరారి, ప్లాంట్ దర్బార్ ఫౌండర్
నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో గార్డెన్ ఉంది. అందులో అన్ని రకాల పూలు, కూరగాయల మొక్కలను పెంచుతున్నా. ఇందుకు సంబంధించిన ప్రతి విషయాన్ని మా అమ్మమ్మ దగ్గర తెలుసుకున్నా. మేళాకు రావడం చాలా సంతోషంగా ఉంది. చాలా పూలు, విభిన్న రకాల మొక్కలు ఇక్కడ ఉండటం సంతోషమనిపించింది. నేను అనేక రకాల పూల మొక్కలు కొన్నా.
– శరిన్, విద్యార్థి
మట్టితో చిన్న చిన్న ఆకృతులు రూపొందించాం. పిల్లలు ఆడుకునేలా ఇంటి సామగ్రిని తయారు చేశాం. మేళాకు చాలా మంది సందర్శకులు వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మా దగ్గర చిట్టి మట్టి వినాయకుడు..దానికి దీపం వెలిగించేందుకు అమర్చిన రూపం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అనేక మట్టి ఉత్పత్తులకు కర్రల సాయంతో నీళ్ల ప్రవాహం సాగేలా రూపొందించాం. కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన వస్తుంది. – ఫాతిమా, ఎర్త్ అండ్ ఆర్ట్ ఫౌండర్