హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మొన్నటి వరకు మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ.. రెండు రోజుల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నెలఖారు వరకు వర్షాలు కష్టమేనని హైదరాబాద్ వాతావరణ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఒకట్రెండు చోట్ల మాత్రమే వాన పడే అవకాశం ఉందని పేర్కొంది.
గరిష్టంగా 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం రోజు 34.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. జూన్ 22వ తేదీ నాటికి సాధారణంగా 82.7 మి.మీ. వర్షపాతం నమోదు కావాలి. కానీ కేవలం 63.4 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇదే వాతావరణం నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలఖారు వరకు కొనసాగే అవకాశం ఉంది.