Hyderabad | వనస్థలిపురం, జూన్ 17 : హస్తినాపురం డివిజన్ శ్రీరమణ కాలనీలో అక్రమ రిజిస్ట్రేషన్ల తంతు కలకలం రేపుతోంది. అసలు ఓనర్ల పేరుతో డాక్యుమెంట్లను సృష్టించి అక్రమంగా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, కలెక్టర్, సీసీఎల్ఏ అధికారులకు ఫిర్యాదులు కూడా అందుతున్నట్లు సమాచారం. కోట్ల రూపాయల విలువైన ప్లాట్లను కొంతమంది ముఠాగా ఏర్పడి కొట్టేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇంత అభివృద్ధి చెందిన సమాజంలో ఇంతపెద్ద అక్రమం ఎలా జరుగుతుందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.
కాలనీ లేఅవుట్ ప్రస్థానం ఇలా…
కర్మన్‌ఘాట్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 60లో 1970 సంవత్సరంలో శ్రీరమణ కాలనీ లేఅవుట్ చేశారు. అందులో 573 ప్లాట్లు చేసి విక్రయించారు. అప్పట్లో ఇరవై, ముప్పై రూపాయలకు గజం చొప్పున చాలా మంది కొనుగోలు చేశారు. కాగా అప్పట్లో కొనుగోలు చేసినవారు కొందరు మర్చిపోవడం, మరణించడం, వారసులకు తెలియకపోవడం వంటి కారణాలతో కొన్ని ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇదే అక్రమార్కులకు అవకాశంగా మారింది. దీంతో ఒక్కొక్కటిగా ఖతం చేశారన్న ఆరోపణలు దండిగా వినిపిస్తున్నాయి.
ఫిర్యాదులున్నా ఆగని తంతు..
శ్రీరమణ కాలనీలో జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్ల తంతుపై స్వయంగా ఎమ్మెల్యేను ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ జరుగుతున్న విషయాలు కొందరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా ఆయన కలెక్టర్, సీసీఎల్ఏ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు ఇక్కడి రిజిస్టేషన్లపై దృష్టి సారించాలని కిందిస్థాయి అధికారులకు సూచించారు. ఇంతా నడస్తున్న తరుణంలో మరో రెండు ప్లాట్లు రిజిస్టేషన్లు జరిగినట్లు తెలుస్తోంది. దాంతో రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల పాత్రపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనిపై కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎల్బీనగర్ సబ్ రిజిస్ట్రార్‌కు కూడా ఫిర్యాదు చేశారు. విషయం పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లినట్లు సమాచారం. కాగా అటూఇటూ వెళ్లిన ఈ వివాదం గుట్టుచప్పుడు కాకుండా రాజీ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అక్రమ బాగోతంపై విచారణ జరపాలి…
ఇదే కాలనీలో సుమారు 15 ప్లాట్లు అక్రమంగా లావాదేవీలు జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అన్నీ 300, 400ల గజాల ప్లాట్లు. ప్రస్తుతం ఇక్కడ గజం రూ.70వేల వరకు పలుకుతోంది. ఈ తతంగంపై గత కొంత కాలంగా రిజిస్టేషన్ల శాఖ, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు కూడా అందాయి. రెండు మూడు చోట్ల అసలు ఓనర్లు వచ్చి కబ్జాదారులతో గొడవలకు దిగిన సంఘటనలూ ఉన్నాయి. నలబై ఏళ్ల క్రితం తాము కష్టపడి కొనుకున్న ప్లాట్లను ఈ ముఠా అక్రమంగా లాగేసుకుంటుందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.