గుట్టుగా రిజిస్ట్రేషన్లు శివారు ప్రాంతాల్లో 22ఏ నిషేధిత జాబితా కొందరు అధికారులకు వరంగా మారింది. జాబితా ఉన్న లొసుగులను ఆసరా చేసుకుని పెద్ద ఎత్తున అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఇండ్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లను నిషేధిత జాబితాలో చేర్చారు. భూదాన్, సీలింగ్, వక్ఫ్‌బోర్డు భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద ఎత్తున ఆక్రమించి తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి.. యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఇప్పుడు అందులోని వేలాది ప్లాట్లు, ఇండ్లు, భూములు నిషేధిత జాబితాలో చేరాయి. ఆ భూముల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో లబోదిబోమంటున్నారు. నిషేధిత జాబితా పేరుతో ముప్పు తిప్పలు పెట్టిన అధికారులు..ఇదే అదునుగా ముడుపులు తీసుకొని రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు చెబుతున్నారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 11(నమస్తేతెలంగాణ) : మహమ్మారిలా మారిన ‘22ఏ నిషేధిత జాబితా’ కుంపంటి నగరవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. లక్షలు, కోట్ల ఆస్తులు చేసుకొని ఇన్నాళ్లు గుండె మీద చెయ్యి వేసుకొని.. ధైర్యంగా ఉన్న కుటుంబాలు.. నేడు సర్కార్ పెట్టిన చిక్కుముడితో తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయి. ప్రజల ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నా.. పరిష్కారం దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. జాబితాపై ప్రతిష్టంభన వీడటం లేదు. మరోవైపు ప్రజల అవసరాలను ‘క్యాష్’ చేసుకునే పనిలో పడ్డారు కొందరు అధికారులు. శివార్లలో నిషేధిత జాబితాలో ఉన్నా.. ముడుపులు తీసుకొని గుట్టుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, బాధితులకు అండగా నిలుస్తున్న బీఆర్ఎస్..వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామంటూ.. భరోసా ఇస్తున్నది.
రంగారెడ్డి/వికారాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం తీసుకొచ్చిన 22 ఏ నిషేధిత జాబితా కొంతమంది అధికారులకు వరంగా మారింది. ఆ లిస్ట్‌లోని లొసుగులను ఆసరాగా చేసుకుని నగర శివారుల్లో ఉన్న తహసీల్దార్లు, ఎస్ఆర్వోలు పెద్ద ఎత్తున అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఇండ్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లను అధికారులు నిషేధిత జాబితాలో చేర్చారు. భూదాన్ , సీలింగ్, వక్ఫ్‌బోర్డు భూములను రియల్ఎస్టేట్ వ్యాపారులు పెద్ద ఎత్తున ఆక్రమించి తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. కాగా, అందులోని వేలాది ప్లాట్లు, ఇండ్లు, భూములు నిషేధిత జాబితాలో చేరాయి. ఆ భూముల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవటంతో లబోదిబోమంటున్నారు. ఇదే అదునుగా భావించిన కొందరు పైరవీకారులు నిషేధిత జాబితాలోని ఇండ్లు, ప్లాట్లు, భూములను రిజిస్ట్రేషన్లు చేయిస్తామని పర్సంటేజీలు మాట్లాడుకుంటున్నారు.
ఇబ్రహీంపట్నం మండలం, రాందాస్పల్లిలోని సర్వేనంబర్ 41లో గుట్టుగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఇటీవల పుకార్లు జరిగాయి. నిషేధిత జాబితా పేరుతో ముప్పుతిప్పలు పెట్టిన అధికారులు ముడుపులు తీసుకుని రియల్టర్లకు రిజిస్ట్రేషన్లు చేశారన్న ఆరోపణలున్నాయి. పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చి ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. చాలామంది రైతులు తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు పైరవీకారులను ఆశ్రయిస్తున్నారు. రాందాస్‌పల్లి రెవెన్యూ సర్వేనంబర్ 41లో సుమారు 1,271ఎకరాల భూమి ఉన్నది. ఏడీ సర్వే గ్రామ నక్షా ప్రకారం ఈ సర్వేనంబర్‌లోని భూమంతా సర్కారీ కంచెగా నమోదైంది. రియల్ఎస్టేట్ వ్యాపారులు లొసుగులను ఆసరాగా చేసుకుని ఈ భూములు తమ పట్టా భూములని నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారు. మరికొంత భూమిని బాండెడ్ లేబర్‌కు కేటాయించారు. నిజానికి ఈ భూమిలో కాల్సా పహాణీ ప్రకారం 1,160 ఎకరాలు పట్టా భూమిగా నిర్ధారించారు. మిగిలిన భూమిలో 15 ఎకరాల సీలింగ్ భూమి బాండెడ్ లేబర్ కోసం ప్రభుత్వం గతంలో 83 ఎకరాలను పంపిణీ చేసింది. ఈ భూమిలో ఉన్న పట్టా భూమిని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ, బాండెడ్ లేబర్ భూములనూ రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని ఆరోపణలున్నాయి.
జిల్లాలోని మంగల్‌పల్లి పరిధిలోని సాహెబ్‌గూడలో ఓ భూమిపై కోర్టు వివాదం సాగుతున్నది. ఆ భూమిని కొందరు పట్టా చేసుకునేందుకు యత్నిస్తున్నారని గ్రామస్తులు కోర్టును ఆశ్రయించగా.. ఆ స్థలంపై ఎలాంటి లావాదేవీలు జరపొద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. ఆ మేరకు రైతులు ఆ భూమిని నిషేధిత జాబితాలో తహసీల్దార్‌ను కలిసి చేర్పించారు. కాగా, ఇటీవల ఆ భూమిపై ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేసినట్టు ఆరోపణలున్నాయి. అధికారులు నిషేధిత జాబితాకు అడుగడుగునా తూట్లు పొడుతుస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కందుకూరు, అబ్దుల్లాపూర్‌మెట్, రాజేంద్రనగర్, శంషాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్ వంటి ప్రాంతాల్లోనూ నిషేధిత జాబితాలో ఉన్న భూములకు గుట్టుగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి.
హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని అందించే హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నీటి వనరులను కాపాడేందుకు గత ప్రభుత్వాలు 111 జీవోను జారీ చేశాయి. ఆ జీవో ద్వారా జంట జలాశయాలకు ముప్పు వాటిల్లే శాశ్వత కట్టడాలను ఆ పరిసరాల్లో నిర్మించొద్దు. ఆ జీవో ప్రస్తుతం అమల్లో ఉన్నా మొయినాబాద్, గండిపేట వంటి మండలాల్లో అక్రమ నిర్మాణాలకు యథేచ్ఛగా అనుమతులు జారీ చేస్తున్నారు. 111 జీవో పరిధిలో ఉన్న ప్లాట్లు, భూముల రిజిస్ట్రేషన్లనూ నిలిపేయకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. దీంతో రియల్ఎస్టేట్ వ్యాపారులు హెచ్ఎండీఏ నుంచి అనుమతులు తెచ్చుకుని పెద్ద పెద్ద వెంచర్లు వేస్తున్నారు. ఇటీవల శంకర్పల్లి మండలంలోని జన్వాడలో 111 జీవో పరిధిలో ఉన్న ఓ వెంచర్‌కు అధికారులు అనుమతులిచ్చారు. ఆ వెంచర్ పూర్తిగా చట్ట విరుద్ధమని తెలిసి వెంటనే కూల్చివేశారు. అలాగే, తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడలో ఉన్న హార్డ్‌వేర్ పార్కులో ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయొద్దు. అయినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు గజానికి కొంత డబ్బు తీసుకుని యథేచ్ఛగా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిషేధిత జాబితాలో ఉన్న లొసుగుల ఆధారంగా ప్లాట్లు, వ్యవసాయ భూములు, విలువైన ఇండ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్లు అధికారులు చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లాలో 22 ఏ సమస్యను పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తుండటంతో బాధితుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతు న్నది. నెల రోజులకుపైగా బాధితులు నిషేధిత జాబితా నుంచి తమ ఇండ్లు, లే అవుట్లను తొలగించాలని కలెక్టర్, తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లకు విన్నవిస్తున్నా ఫలితం లేదు. తమ సమస్యను పరిష్కరించాలని అధికారులకు అందించిన దరఖాస్తులను వారు ఆయా సబ్ రిజిస్ట్రార్ల (ఎస్ఆర్వోలు)కు ఫార్వర్డ్ చేయడం తప్ప పరిష్కారం దిశగా ఒక్క సమావేశాన్ని నిర్వహించకపోవడం దారుణం. సబ్ రిజిస్ట్రార్లు తమకు వచ్చిన దరఖాస్తులను జిల్లా రిజిస్ట్రార్‌కు ఫార్వర్డ్ చేసి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలున్నాయి. 22ఏ జాబితా నుంచి తొలగించాల్సింది రెవెన్యూ అధికారులదేనంటూ వారు పేర్కొంటున్నారు.
రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 22 ఏ జాబితాలో చేర్చిన అప్రూవుడ్ లేఅవుట్లు, ఇండ్లను తొలగించేందుకు ప్రత్యేక బృందాలను నియమించి దిద్దుబాటు చర్యలు చేపట్టగా, జిల్లాలో మాత్రం ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. లేఅవుట్లు, ఇండ్లను తొలగించేందుకు ఎలాంటి ఆదేశాలు రాలేదని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు చెబుతున్నారు. గత నెల రోజులుగా జిల్లా కేంద్రంతోపాటు తాండూరు, పరిగి పట్టణాల్లో మాటిగేజ్ రిజిస్ట్రేషన్లు తప్ప ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తిగా తగ్గిపోయాయి. వికారాబాద్ జిల్లా కేంద్రంతోపాటు తాండూరు, పరిగి పట్టణాల్లో లేఅవుట్లుగా ఏర్పాటై, ఇండ్ల నిర్మాణం జరిగిందని రెవెన్యూ యంత్రాంగానికి తెలిసినా ప్రొహిబిటెడ్లో చేర్చారు. తాండూరులో 77 ఎకరాల్లో ఏర్పాటైన అప్రూవుడ్ లేఅవుట్లు, ప్లాట్లు, ఇండ్లను 22ఏ జాబితాలో చేర్చారు. పరిగి పట్టణంలోనూ చాలావరకు ప్లాట్లు, ఇండ్లు 22ఏ జాబితాలో చేర్చారు. ఏండ్ల కిందటి లేఅవుట్లను కూడా 22ఏలో చేర్చడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.