సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో గ‘లీజు’ దందాలపై ఎట్టకేలకు అధికారులు కదిలారు. షాపుల అద్దె గడువు ముగిసినా..ఏండ్ల తరబడి కొనసాగుతున్న జీహెచ్ఎంసీ ఖజానాకు వ్యాపారస్తులు గండి కొడుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఏండ్ల తరబడి లీజు గడువు ముగిసినా వాటిని స్వాధీనం చేసుకోవడంలో ఎస్టేట్ విభాగం నిర్లక్ష్యం చేస్తున్నది. గజం స్థలానికి రూ.1 అద్దె చెల్లిస్తోన్న లీజు ఒప్పందాలు నేటికీ యధావిధిగా కొనసాగుతున్నాయి. అజాద్(మోతీ) మార్కెట్ లీజుల గడువు ఇందుకు ఉదాహరణగా పేర్కొంటూ ఇటీవల ‘నమస్తే’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఈ నేపథ్యంలోనే కమిషనర్ ఇలంబర్తి ఎస్టేట్ విభాగంలో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 14 మున్సిపల్ మార్కెట్ల పరిధిలో 838 షాపులకు నోటీసులు జారీ చేశారు. వీటిలో 206 షాపులకు మాత్రమే హియరింగ్ నిర్వహించారు. వీటితో పాటు 13 మున్సిపల్ కాంప్లెక్స్‌లో 319 దుకాణాలున్నాయి. వీటన్నింటికీ నోటీసులు జారీ చేశారు. మొత్తంగా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్న వ్యాపారులను ఖాళీ చేయించడం, తద్వారా కొత్తగా టెండర్లతో ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తున్నారు.
వాస్తవంగా లీజు పూర్తయ్యాక అధికారులు ఆయా దుకాణాలను ఖాళీ చేయించాలి. మళ్లీ టెండర్ వేలం వేసి ప్రక్రియను కొనసాగించాలి. ఏడాదికొకసారి అద్దె విలువ 5 శాతం మేర పెంచాలి. కానీ ఎస్టేట్ విభాగం నోటీసులతోనే సరిపెడుతున్నది. ఇటీవల కాలంలో 14 యూనియన్ కార్యాలయాలతో పాటు 2300 షాపుల లీజుదారులకు నోటీసులు ఇచ్చారే కానీ ఇప్పటి వరకు పురోగతి సాధించలేదు. అయితే తాజాగా మున్సిపల్ మార్కెట్లు, మున్సిపల్ కాంప్లెక్స్‌లకు సంబంధించి 1157 షాపులకు నోటీసులు జారీ చేశారు.
జీహెచ్ఎంసీ ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రార్ ఏర్పాటు చేసి దాని ప్రకారంగా కంప్యూటరైజ్ చేశారు. ఆస్తులకు సంబంధించిన లీజు పూర్తయిన, ఇంకా కొనసాగుతున్నట్లు వివరాలను సేకరించి వారందరికీ నోటీసులు జారీ చేసి వాటి వివరాలను అందులో పొందుపర్చారు. లీజుకు తీసుకున్న వ్యక్తి వినియోగించుకుంటున్నారా లేదా ఇతరులు ఉపయోగించుకుంటున్నారా అని క్షేత్ర స్థాయిలో జోనల్ అసిస్టెంట్ ఎస్టేట్ అధికారులు విచారించి నివేదిక సిద్ధం చేశారు. లీజు మారెట్ రేటు ప్రకారంగా కేటాయింపు జరగాలని, లీజు పూర్తయిన ఇంకా కొనసాగుతున్న వివరాలను పూర్తి నివేదిక అందజేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. అద్దె చెల్లింపు కూడా ఆన్లైన్ ద్వారా చెల్లించడంతో పాటు ఒకొక ఆస్తికి ఒక ఐడీ కేటాయిస్తున్నారు.