సిటీబ్యూరో, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ): మహ్మద్ యాగోబ్ మహ్మద్ అలీ అనే వ్యక్తి 2011లో స్టూడెంట్ వీసాపై సూడాన్ నుంచి ఇండియాకు వచ్చాడు. సికింద్రాబాద్ పీజీ కాలేజీలో బీసీఏ కోర్సులో చేరాడు. ఆ తర్వాత ఈసీఐఎల్‌లో కిరాయికి ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులతో టాంజేనియా దేశస్తుడితో కలిసి గంజాయి అమ్మకాలు ప్రారంభించాడు. ఆ తర్వాత అనేక సార్లు పోలీసులకు డ్రగ్స్ కేసుల్లో పట్టుబడ్డాడు.
అతనితో దేశభద్రతకు ప్రమాదమని భావించిన హైదరాబాద్ పోలీసులు అతడిని స్వదేశమైన సూడాన్‌కు పంపడానికి ప్రయత్నాలు చేస్తే అతనిపై ఉన్న కేసులు అడ్డంకిగా నిలిచాయి. చివరకు కోర్టు ద్వారా అతని కేసులను క్లియర్ చేసి సూడాన్‌కు తిరిగి పంపారు. గంజాయి అమ్మకం, సేవించడం వంటి వాటితో పలు కేసుల్లో చిక్కుకున్న సూడాన్ దేశస్తులు మహ్మద్ యాగోబ్ మహ్మద్ అలీ, మహ్మద్ అబ్దుల్ రహెమాన్ ఉస్మాన్‌లను డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలున్నాయన్న సమాచారంతో గత సంవత్సరం అక్టోబర్‌లో హెచ్‌న్యూ టీమ్ అరెస్ట్ చేసింది.
ఉస్మాన్ దగ్గర ఎండీఎంఏ లభించడంతో అతనిపై హుమాయున్ నగర్ పోలీసులు కేసు పెట్టి జుడిషియల్ కస్టడీకి తరలించారు. మరోవైపు యాగోబ్ మహ్మద్ అలీ పన్నెండేళ్లుగా ఇండియాలో ఉన్నాడని, అతని పాస్‌పోర్ట్, వీసా గడువు ముగిసినా ఇంకా ఇక్కడే నివసిస్తున్నట్లుగా హెచ్‌న్యూ పోలీసులు గుర్తించారు. అతనికి సంబంధించి డిపోర్టేషన్ ప్రాసెస్ చేసే క్రమంలో కోర్టు కేసులు అడ్డురావడంతో 11నెలలు ఆలస్యమైంది. ఆ తర్వాత ప్రాసెస్ చేసి అతనిని సూడాన్‌కు తిరిగి పంపించామని టాస్క్‌ఫోర్స్ అండ్ హెచ్‌న్యూ డీసీపీ వైవీఎస్ సుదీంద్ర తెలిపారు.