Vinayak Nagar | మైలార్‌దేవ్‌పల్లి, మార్చి 16 : ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు వాటిని ఆక్రమించుకోని నిర్మాణాలు చేపట్టాలని అక్రమార్కులు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ స్థలాలపై కన్నేసి రాత్రికి రాత్రి నిర్మాణాలను చేసుకుంటూపోతున్నారు. అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.
మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ వినాయక్‌నగర్ బస్తీలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. సర్వే నెంబర్ 115/1లో సుమారు 400 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రి రూమ్‌లు, ప్రహారీ గోడను నిర్మించుకుంటున్నారు. నకిలీ దస్తావేజులు సృష్టించుకోని వీటిని మార్కెట్లో విక్రయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను కాపాడి ప్రజల ఉపయోగార్ధం వినియోగాంచాల్సిన కోట్లాది రూపాయల స్థలాలను కబ్జాదారుల చేతుల్లో పెడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు.