ఉప్పల్, జూన్ 14 : అక్రమ నిర్మాణాలు పలువురికి కాసులు కురిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. చర్యలు చేట్టాల్సిన అధికారులు, అడ్డుకోవాల్సిన ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఒకే లేఅవుట్లో వంద నుంచి నూటయాబైకి పైగా భారీగా వ్యాపార సముదాయాలకు కావాల్సిన షెడ్డు నిర్మాణాలు వెలిశాయి. అక్రమ నిర్మాణాలను అడ్డుకోకపోవడంతో వ్యాపార కేంద్రాలు వెలిశాయి. వ్యాపార కేంద్రాలకు ట్యాక్స్‌ను విధించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం, అక్రమ నిర్మాణాలపై రెట్టింపు పన్నులు విధించకపోవడంతో అనుమానాలకు తావిస్తున్నది.
నిబంధనలు పాటించని వారిపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటాం. అక్రమ నిర్మాణాలపై విచారణ చేపట్టి, నిబంధనల మేరకు కఠిన చర్యలు చేపడతాం. ట్యాక్స్ విధింపు, వ్యాపార కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష చేస్తాం. మా దృష్టికి వచ్చిన అన్ని అంశాలపై దృష్టి సారిస్తాం. వ్యాపార కేంద్రాల నిర్వహణపై ప్రత్యేకంగా విచారిస్తాం. ఉప్పల్ భగాయత్‌లో చేపడుతున్న షెడ్ల నిర్మాణాలపై అధికారులతో చర్చిస్తాం.
– ఆంజనేయులు, డిప్యూటీ కమిషనర్, ఉప్పల్ సర్కిల్
ఉప్పల్ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతున్నది. మూసీకి ఆనుకొని ఉన్న భగాయత్ లేఅవుట్లోని ప్రాంతంలో కమర్షియల్ నిర్మాణాలకు అనుమతులు లేవు. అయితే వీటికి విరుద్ధంగా వేల సంఖ్యలో వ్యాపార కేంద్రాలు వెలిశాయి. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో మరిన్ని నిర్మాణాలు వెలుస్తున్నాయి. వీటిలో ప్రధానంగా భూ యాజమానుల వద్ద భూమిని తీసుకొని, వ్యాపారులు షెడ్డు నిర్మాణాలు చేపట్టి, వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. 200 నుంచి వేయి గజాల వరకు షెడ్డు నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రధాన రహదారిలో ఇప్పటికే బహుళ నిర్మాణాలు చేపట్టారు. దర్జాగా పెద్ద బోర్డులతో వ్యాపార కేంద్రాలు దర్శనమిస్తున్నాయి.
ఉప్పల్ భగాయత్ ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేసి, భూ యజమానులకు కేటాయించింది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టిన లేఅవుట్లో విశాలమైన రోడ్లు ఏర్పాటు చేశారు. అయితే లేఅవుట్లో భారీగా షెడ్లు నిర్మించడంతో భగాయత్ లేఅవుట్ రూపురేఖలు మారిపోయాయి. అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపట్టకుండా, అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో భారీ భవనాలు వెలిశాయి. వీటికితోడు భారీ షెడ్డు నిర్మాణాలతో అక్రమ నిర్మాణాలకు ఆజ్యం పోసినైట్లెంది. అయితే నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు చేపట్టడం, అక్రమ నిర్మాణదారులకు 200 శాతం ట్యాక్స్ వేయాల్సిన అధికారులు, అసలు ట్యాక్స్ విధించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ నిర్మాణాలు, ట్యాక్స్ విధింపుల నిర్లక్ష్యంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపడితేనే విషయం వెలుగులోకి వస్తుందని భగాయత్ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, ఒక్కటి కూడా అక్రమ నిర్మాణం కూల్చివేయకపోవడం, నోటీసులతోనే సరిపెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.