మేడ్చల్: వివాదాస్పద స్థలాల్లో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. రాత్రికి రాత్రే షెడ్లు వేసి నిర్మాణాలు చేపడుతున్నా.. అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెంగిచెర్లలో ఉన్న 34,35,36 సర్వే నంబర్ల భూమి హైకోర్టులో స్టేటస్ కో ఆర్డర్ ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇరువురి మధ్య భూమికి సంబంధించిన కేసు కోర్టులో ఉన్నా.. రాజకీయ అండదండలతో అనుమతులు లేకుండా నిర్మాణాలు నిర్మిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ నిర్మాణాల విషయమై బోడుప్పల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. బోడుప్పల్‌కు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల అండదండల వల్ల యధేచ్ఛగా అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ భూముల కబ్జాలు వంటివి అనేకం జరుగుతున్నా.. కాంగ్రెస్ నాయకులు చెప్పిందే వేదంగా అధికారులు నడుచుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్లలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. కోర్టు కేసులో ఉన్న వివాదాస్పద భూమిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం. బోడుప్పల్ మున్సిపల్ పరిధిలో అనుమతులు లేని నిర్మాణాలు, ప్రభుత్వ భూముల కబ్జా చేస్తే నిబంధనల మేరకు చర్యలు చేపడుతాం. చెంగిచెర్లలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలపై త్వరలోనే చర్యలు ఉంటాయి.
– రాంలింగం, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్