సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్వచ్ఛ టిప్పర్ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్‌ను నేతలు సోమవారం కలిశారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కలమడుగు రాజేందర్ ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను రఘు ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లారు. స్వచ్ఛ ఆటో టిప్పర్ వాహనాల బకాయిలు జీహెచ్ఎంసీ చెల్లించకపోవడంతో లోన్లు కట్టలేని స్థితిలో కార్మికుల సిబిల్ క్రెడిట్ స్కోర్ తగ్గిపోవడంతో.. కార్మికులు తమ అవసరాల కోసం చిన్న చిన్న లోన్లకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.
స్పందించిన రఘు ప్రసాద్ మొదటి విడతలో కేటాయించిన 2,500 వాహనాలకు సంబంధించి బకాయిలను వెంటనే విడుదల చేసి కార్మికుల సిబిల్ స్కోర్ పునరుద్ధ్దరించడానికి బ్యాంక్ అధికారులతో మాట్లాడి న్యాయం చేయాలని ఫైనాన్స్ విభాగానికి ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు ప్రవీణ్‌కుమార్, శివ, రామాంజి, శ్రీనివాస్, ముని, రాజు, రుద్రయ్య పాల్గొన్నారు.