Outside Food | వర్షాకాలంలో జీర్ణాశయ, పేగుల ఇన్ఫెక్షన్ల ప్రమాదం గణనీయంగా పెరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కాలంలో అతిసారం, వాంతులు, కడుపు నొప్పి, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వర్షాల కారణంగా తాగునీటి వనరులు కలుషితమవడం, బ్యాక్టీరియా, వైరస్లు, పరాన్నజీవులు వేగంగా వ్యాప్తి చెందేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడటం ఇందుకు ప్రధాన కారణాలుగా ఉంటాయి.వ ర్షాకాలంలో అధిక తేమ, తడి వాతావరణం కారణంగా సూక్ష్మజీవులు వేగంగా వృద్ధి చెందుతాయి. భారీ వర్షాల సమయంలో మురుగునీరు తాగునీటిలో కలిసిపోవడం వల్ల జీర్ణాశయ సంబంధిత ఇన్ఫెక్షన్ల ప్రమాదం మరింత పెరుగుతుంది. పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ ఇన్ఫెక్షన్లకు ఎక్కువగా గురవుతారు. వర్షాకాలంలో ఆహారం సులభంగా కలుషితమవుతుంది. సరిగా నిల్వ చేయని ఆహారం, పూర్తిగా ఉడకని పదార్థాలు లేదా అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారైన ఆహారంలో బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది.
రోడ్ల పక్కన అపరిశుభ్రంగా విక్రయించే ఆహారం, ముందే కోసి బహిరంగంగా ఉంచిన పండ్లు, శుభ్రంగా కడగని పచ్చి కూరగాయలు, సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయని పాల ఉత్పత్తులు ఈ కాలంలో కలుషితమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వర్షాల సమయంలో నిల్వ నీరు, పారిశుద్ధ్య లోపాలు, రద్దీ ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణం కూడా ఇన్ఫెక్షన్ల వ్యాప్తికి దోహదం చేస్తాయి. ముఖ్యంగా వర్షపు నీటికి గురయ్యే స్ట్రీట్ ఫుడ్‌పై ఈగలు, దుమ్ము, కలుషిత నీటి ప్రభావం ఎక్కువగా ఉండటంతో వాటిని తీసుకోవడం ప్రమాదకరం. పేగు ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు తరచూ విరేచనాలు, వికారం, వాంతులు, కడుపు నొప్పి లేదా మంట, ఉబ్బరం, అజీర్ణం, జ్వరం, ఆకలి తగ్గడం, నీరసం, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు రెండు రోజులకుపైగా కొనసాగినా, తీవ్ర డీహైడ్రేషన్, మలంలో రక్తం లేదా అధిక జ్వరం ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
వర్షాకాలంలో తాగునీటి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఫిల్టర్ చేసిన, మరిగించిన లేదా శుద్ధి చేసిన నీటినే తాగాలి. వరదలు లేదా నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో తెలియని వనరుల నుంచి నీరు తాగకూడదు. చేతుల పరిశుభ్రత కూడా అత్యంత కీలకం. భోజనం చేసే ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత, బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా అనేక ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. బయట బహిరంగంగా ఉంచిన, ముందే కోసిన లేదా మూత లేకుండా విక్రయించే ఆహారాన్ని తినకూడదు. వీలైనంత వరకు తాజాగా వండిన వేడి ఆహారాన్నే తీసుకోవడం సురక్షితం.
పండ్లు, కూరగాయలను శుభ్రమైన నీటితో బాగా కడిగి తినాలి. సాధ్యమైనంత వరకు పండ్ల తొక్క తీసి తినడం మంచిది. తేమ ఎక్కువగా ఉండే ఈ కాలంలో ఆహారం త్వరగా పాడవుతుంది. అందువల్ల ఎక్కువసేపు బయట ఉంచిన ఆహారం లేదా వండిన తరువాత చాలా సేపు నిల్వ ఉంచిన వంటకాలను తినకుండా, తాజాగా వండిన ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వాలి. పాలు, మాంసాహార పదార్థాలు, వండిన ఆహారం వంటి త్వరగా పాడయ్యే పదార్థాలను వెంటనే ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి. సరైన నిల్వ విధానం బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుని ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు, ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. ముఖ్యంగా విరేచనాలు ఉన్నప్పుడు శరీరంలో నీటి లోపం రాకుండా తగినంత ద్రవాలు తీసుకోవడం ఎంతో అవసరం. ఈ సీజన్లో ముఖ్యంగా బయట ఆహారాన్ని నివారించడం వల్ల అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.