Hyderabad | ఆదిభట్ల, ఫిబ్రవరి 13: ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని ముఖ్య కూడళ్లు, ప్రధాన రోడ్ల వెంట ఎక్కడబడితే అక్కడ రేకుల పైకప్పుతో కొందరు యజమానులు ఏకంగా షాపులను నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణాలకు స్థానిక మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోవడం లేదు. చకచకా నిర్మాణాలు చేపట్టి కమర్షియల్ షాపులకు ఇతరులకు కిరాయికి ఇచ్చి రూపాయలు లక్షలలో పోగు చేసుకుంటున్నా… క్షేత్రస్థాయిలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది తూతూ మంత్రంగా తనిఖీలు చేపట్టడంతో మున్సిపల్ ఆదాయానికి లక్షల్లో గండిపడుతుంది.
ఆదిభట్ల మున్సిపాలిటీ కొన్నేళ్లుగా అభివృద్ధిలో దూసుకుపోతుంది. పట్టణం నలువైపులా విస్తరించి ఎన్నో కొత్త కాలనీలు వెలుస్తున్నాయి. తొమ్మిది విలీన గ్రామాలతో పాటు మున్సిపాలిటీలోని ప్రతి గ్రామానికి రవాణా సౌకర్యంతో పాటు వ్యాపార సౌకర్యాలు పెరిగాయి. దీనిని అధునిక చేసుకొని ముఖ్య కూడళ్లతో పాటు ప్రధాన రోడ్ల వెంట కొందరు భవన యజమానులు స్థానిక మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే రేకుల పైకప్పులతో పాటు షెట్టర్లు బిగించి వందలాది షాపులను పక్కాగా నిర్మిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్ గ్రామంలో నూతన కలెక్టరేట్ తో పాటు ఫాక్స్ కాన్, కేన్స్ కంపెనీ ల తో ఏర్పాటుతో చుట్టుపక్కల ప్రాంతాలకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో మంగళ్ పెళ్లి చౌరస్తా తో పాటు బొంగులూరు నాగార్జునసాగర్ హైవేపై ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు వంద షాపులు వెలిశాయి. అలాగే ఆదిభట్ల సమీపంలోని టీసీఎస్ సమీపంలో వందల సంఖ్యలో ఎలాంటి అనుమతులు లేకుండా రేకుల షెడ్డుతో షెట్టర్లు వేసి షాపులు మెయిన్ రోడ్డు పై దర్శనమిస్తున్నాయి.
అలాగే మున్సిపల్ పరిధిలోని గ్రామాలలో సైతం ప్రధాన రహదారుల వెంట రేకుల పైకప్పుతో పక్కాగా షాపులను నిర్మించి కిరాయికి ఇచ్చి నెలకు కనిష్టంగా ఐదు వేల నుండి పదివేల వరకు వసూలు చేస్తున్నారు. అలాగే వివిధ ప్రాంతాల్లో రేకుల షెడ్లు ఎక్కడబడితే అక్కడ వెళుతున్నాయి. వీటిలో వివిధ వ్యాపార, వాణిజ్య లావాదేవీలు యథేచ్చగా కొనసాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమంగా నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్న ఈ దుకాణ సముదాయాల నుంచి మున్సిపాలిటీకి ఏమాత్రం ఆస్తి పన్ను రావడం లేదు. ముఖ్యంగా వీటిని కట్టడి చేయడానికి టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించిన దాఖలాలు లేవని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆదిభట్ల మున్సిపాలిటీ లో భారీగా ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది. వాస్తవానికి మున్సిపాలిటీ పరిధిలో ఇల్లు (రెసిడెన్షియల్), దుకాణాలు( కమర్షియల్) నిర్మించే ముందు స్థలం యజమాని అన్ని ధ్రువపత్రాలు సమర్పించి మున్సిపల్ అధికారుల నుంచి అనుమతి పొందాలి. ఆ తరువాతే నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. నిర్మాణం పూర్తయ్యాక డోర్ నెంబర్ తో పాటు అసెస్ మెంట్ చేసుకొని ఏటా ఆస్తి పన్ను చెల్లించాలి.
తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటాం : ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ
ప్రస్తుతం మున్సిపాలిటీలోని అక్రమ షెడ్ల నిర్మాణం పై తనిఖీలు నిర్వహిస్తాం. ఎక్కడెక్కడ రేకుల పైకప్పుతో షాపులు నిర్మించారో… అలాగే మున్సిపాలిటీ పరిధిలో రేకుల షెడ్లు ఎన్ని ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ఆస్తి పన్ను చెల్లించాలని బాధ్యులకు నోటీసులు జారీ చేస్తాం. అప్పటికి స్పందించకపోతే తగు చర్యలు తీసుకుంటాం.