Adibatla | ఆదిభట్ల, మే 3 : అనుమతులకు మించి నిర్మాణాలను చేపట్టిన భవనాలను శనివారం ఆదిభట్ల మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు. ఈ సందర్బంగా ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ మట్లాడుతూ.. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో జీ ప్లస్ టూ పర్మిషన్ తీసుకుని ఎంతో మంది అక్రమంగా ఐదు ఆరు అంతస్తుల భవనాలను నిర్మించుకుంటున్నారని తెలిపారు.
టీసీఎస్ ఎదురుగా ఇలా జీ ప్లస్ టూ పర్మిషన్ తీసుకుని ఐదారు అంతస్తులు కట్టిన 25 భవనాలను గుర్తించామని ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఇప్పటికే అనుమతులకు మించి నిర్మాణాలు చేపడుతున్న వారు వెంటనే పనులు నిలిపివేయాలని ఆదేశించారు. లేనిపక్షంలో కూల్చివేతలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్‌పల్లి, ఆదిభట్ల, కొంగరకలాన్, ఎంపీ పటేల్ గూడతో పాటు మరికొన్ని గ్రామాలలో అనుమతులకు మించి నిర్మాణాలు చేపడుతున్న దాదాపు 80 భవనాలను గుర్తించామని తెలిపారు. ప్రతి రోజు కార్యాచరణతో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూలుస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు అనుమతులు తీసుకున్నంత వరకే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.