సిటీబ్యూరో/కేపీహెచ్‌బీ కాలనీ, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : నిర్మాణ రంగ అనుమతుల్లో బడా బిల్డర్లకు నిబంధనలకు తిలోదాకాలిస్తూ అందినకాడికి దండుకుంటూ కొందరు టౌన్ ప్లానింగ్ అధికారులు బహుళ అంతస్తుల భవనాలను జీ హుజూర్ అంటూ పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. ఇంటి నిర్మాణ అనుమతి నుంచి ఓసీ (అక్యూపెన్సీ సర్టిఫికెట్) జారీలో చిన్న పాటి అక్రమం ఉంటేనే సంబంధిత దరఖాస్తును తిరస్కరించే అధికారులు …ఏకంగా ఎలాంటి అప్రోచ్ రోడ్ లేని స్థలంలో భారీ భవంతికి అనుమతి ఇచ్చిన తీరు అధికారులకే చెల్లింది.
కూకట్‌పల్లిలోని కైత్లాపూర్ బ్రిడ్జి సమీపంలో సర్వే నంబరు 988, 991లలోని దాదాపు 2.5 ఎకరాల్లో బహుళ అంతస్తుల (నాలుగు బ్లాక్‌లలో) నిర్మాణానికి బిల్డర్ జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్నాడు. గతేడాది ఆగస్టులో అధికారులు అనుమతి (ఫైల్ నంబరు 003142) ఇచ్చేశారు. అయితే నిర్మాణ సమయంలో సదరు బిల్డర్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన 40 అడుగుల స్థలాన్ని అప్రోచ్ రోడ్డుగా చూపించి అడ్డదారిలో అనుమతులు పొందినట్లు ఫిర్యాదులు రావడంతో ఒక్కసారిగా ఈ అంశం టౌన్ ప్లానింగ్‌లో చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో వెలుగులోకి..
ఏదైన బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టాలంటే ఆ స్థలానికి అప్రోచ్ రోడ్డు తప్పనిసరి.. సంబంధిత నిర్మాణదారుడిదే ఆ స్థలం అయి ఉండాలి.. కానీ హౌసింగ్ బోర్డు స్థలాన్ని తమది అని చూపిస్తూ బిల్డర్ దరఖాస్తు చేసుకోవడం.. క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించకుండానే చకచకా అధికారులు సదరు దరఖాస్తును క్లియర్ చేశారు. ఈ అనుమతుల జారీలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, కూకట్పల్లి జోనల్ టౌన్ ప్లానింగ్ అధికారుల ఉదాసీనత.. హౌసింగ్ బోర్డ్డు వ్రెస్టన్ డివిజన్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది.
ప్రధాన కార్యాలయ అధికారుల కంటే మేం ఏమైనా తక్కువ అని.. కూకట్పల్లి జోనల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా మరో మూడు భవనాలకు జోనల్ స్థాయి అనుమతులను జారీ చేశారు. ఈ విషయంపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, స్థానిక కార్పొరేటర్ పగడాల శిరీష బాబూరావును జీహెచ్ఎంసీ, హౌసింగ్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన ఆయా విభాగాల అధికారులు.. హౌసింగ్ బోర్డ్ స్థలాన్ని, అనుమతులు ఇచ్చిన భవన స్థలాలను పరిశీలించి, ఈ స్థలంలో చుట్టూ కంచెను వేసే పనులను చేపట్టారు. ఇంతలోనే అప్రమత్తమైన సదరు నిర్మాణదారుడు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకోవడంతో పనులను నిలిపివేశారు.
40 అడగుల అప్రోచ్ రోడ్డు..
కూకట్పల్లి నియోజక వర్గం బాలాజీనగర్ డివిజన్ లోని కాముని చెరువు సమీపంలోని కైత్లాపూర్ ఫె్లైఓవర్ బ్రిడ్జి పక్కన.. కేపీహెచ్‌బీ కాలనీ 15వ ఫేస్‌కు చెందిన 2.12 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలం మీదుగా గతంలో సెప్టిక్ నిర్మాణం కోసం కచ్చా దారి ఉండేది. స్థలాలకు పక్కనే.. కూకట్పల్లి గ్రామం సర్వేనంబర్ 988, 991ల్లో ప్రైవేట్ వ్యక్తుల స్థలాలు ఉన్నాయి. ఈ స్థలంలో ఓ ప్రైవేట్ సంస్థ.. ఐదు బ్లాకులు.. ఐదు అంతస్తుల భవన నిర్మాణాల కోసం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఈ సమయంలో హౌసింగ్ బోర్డుకు చెందిన 40 అడుగుల స్థలాన్ని అప్రోచ్ రోడ్డుగా చూపించగా.. ఇవేం పట్టించుకోకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు.. భవన నిర్మాణాల కోసం గతేడాది ఆగస్టు 4న అనుమతులను జారీ చేశారు. మరోవైపు దీని పక్కనే మరో మూడు భవనాల కోసం జోనల్ స్థాయిలో దరఖాస్తు చేసుకోగా మేము ఏమైనా తక్కువ అని.. అప్రోచ్ రోడ్లను పరిశీలించకుండానే అనుమతులను జారీ చేశారు. ఇదిలాఉంటే టౌన్‌ప్లానింగ్ అధికారులు మాత్రం సర్వే నంబర్ 988, 991లలో రెండు దశాబ్దాల కిందట నుంచే అనుమతులు పొందుతున్నారని చెబుతుండటం గమనార్హం.
ఆలస్యంగా తెలుసుకున్నాం
-కిరణ్ బాబు, ఈఈ, వెస్ట్రన్ డివిజన్, హౌసింగ్ బోర్డు
కేపీహెచ్‌బీ కాలనీ 15వ ఫేస్‌లో హౌసింగ్ బోర్డు స్థలం మీదుగా రోడ్డును చూపించి.. భవన నిర్మాణాలకు అనుమతులు పొందిన విషయం ఆలస్యంగా తెలిసింది. వెంటనే ఆ స్థలంలో బోర్డును పాతి కంచెను వేసే పనులను చేపట్టాం. కోర్టు నుంచి స్టే ఆర్డర్ రావడంతో పనులు ఆగిపోయాయి. మరోవైపు జీహెచ్ఎంసీ జోనల్, ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదులు చేశాం. అనుమతులు పొందిన వ్యక్తులు చూపిన దారి హౌసింగ్ బోర్డు స్థలమని, దీని గుండా ఎలాంటి దారి లేదని సంబంధిత ప్రతాలు అందించాం. ఉన్నతాధికారుల ఆదేశాల పాటిస్తూ చర్యలు తీసుకుంటున్నాం.
అనుమతులను పరిశీలిస్తున్నాం
– గణపతి, జోనల్ సిటీ ప్లానర్, కూకట్పల్లి జోన్
కేపీహెచ్‌బీ కాలనీ 15వ ఫేస్‌లో హౌసింగ్ బోర్డు స్థలాన్ని రోడ్డుగా చూపించి అనుమతులు పొందిన భవనాలను పరిశీలించాం. అనుమతుల కోసం సదరు బిల్డర్ సమర్పించిన ధ్రువప్రతాలను మరోసారి పరిశీలిస్తాం. తప్పుడు ప్రతాలతో అనుమతులు పొందితే చట్టపరంగా చర్యలు ఉంటాయి. నివేదికను అందజేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.