ఖైరతాబాద్, జూలై 29 : ఖైరతాబాద్‌లో లంపెన్ గ్యాంగ్‌ల అరాచకాలు పెరిగిపోయాయని, పోలీసుల అండదండలతోనే వారు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపించారు. పోలీసులు చర్యలు తీసుకోవడంలో విఫలమైతే స్థానికులమే ఆ పని చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 27న లంపెన్ గ్యాంగ్ దాడిలో గాయపడి అవమానభారంతో సోమవారం వీరబోయిన ముఖేశ్బాబు (30) ఆత్మహత్య చేసుకున్న ఘటన విదితమే.
ఈ ఘటనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పోలీసుల అలసత్వమే కారణమంటూ స్థానికులు అధికారులను నిలదీశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కూడా విరుచుకుపడ్డారు. వందలాది మంది అశ్రునయనాల మధ్య సోమవారం రాత్రి ముఖేశ్బాబు అంత్యక్రియలు ముగిశాయి. కాగా, మంగళవారం సాయంత్రం ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్లో స్థానికులతో పోలీసులు చర్చలు నిర్వహించారు.
డబుల్ బెడ్రూం సముదాయంలో, ఐమాక్స్ ఎదురుగా హెచ్ఎండీఏ ఖాళీ స్థలాలు నిత్యం గంజాయి బ్యాచ్‌లు ఉంటున్నాయని, స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని వివిధ బస్తీలకు చెందిన ప్రజలు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. స్థానిక నేతలు మహేందర్ బాబు, మహేశ్ యాదవ్, గజ్జెల ఆనంద్‌లు మాట్లాడుతూ.. పోలీసులకు నేరుగా నిందితులతో లింక్స్ ఉన్నాయని, సెటిల్మెంట్లన్నీ ఠాణాలో జరుగుతున్నాయని స్థానిక ప్రజలు చెబుతున్నారని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. ఏసీపీ సంజయ్ కుమార్ స్పందిస్తూ అవన్నీ అవాస్తమని, ఆ గ్యాంగ్‌పై ఎవరూ సరైన ఫిర్యాదులు చేయడం లేకపోవడం వల్లే చర్యలు తీసుకోలేదన్నారు.
ఇక నుంచి ఖైరతాబాద్‌లో బ్యానర్లను నిషేధిస్తున్నామని, వినాయకచవితికి ఒక్క బ్యానర్ కూడా ఉండరాదన్నారు. ఎవరైతే బ్యానర్లు ఏర్పాటు చేస్తారో వారిపై చర్యలు తీసుకుంటా మన్నారు. నిత్యం పెట్రోలింగ్ నిర్వహిస్తామని, రోడ్లపై ఎవరూ ఉండకుండా చూస్తామన్నారు. వినాయకచవితి కల్లా ఖైరతాబాద్‌లో పూర్తి స్థాయిలో శాంతిభద్రతలు నెలకొనేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరానగర్ 2బీహెచ్‌కే డిగ్నిటీ హౌజెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్, మధుకర్ యాదవ్, ధర్మేశ్ ముదిరాజ్, ఆవుల అనిల్ కుమార్, రాజు, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.