IGNOU | అబిడ్స్ మార్చి 5 :జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం నూతన విద్యా విధానంలో అందిస్తున్న వివిధ రకాలైన ప్రోగ్రాములు విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడంతో పాటు అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు. ఇగ్నో ప్రాంతీయ స్నాతకోత్సవాన్ని నిజాం కళాశాలలో గల ఏసీ ఆడిటోరియంలో నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. 2047 సంవత్సరానికి 100 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదగడంలోనూ దేశంలోని ఆర్థిక అసమానతలను రూపుమాపడంలో యువ విద్యార్థులు, ఉద్యోగులు ముందంజలో ఉండాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా భారత దూరవిద్య పితామహుడు తెలంగాణకు చెందిన ప్రొఫెసర్ జి రామ్ రెడ్డి సేవలను కొనియాడారు. హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రానికి సంబంధించి 2370 పిజి, డిగ్రీ, డిప్లొమా సర్టిఫికెట్ స్నాతకోత్సవ డిగ్రీలను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఇగ్నో ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ కే రమేష్ వార్షిక నివేదికను సమర్పించారు. హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం నుండి దేశంలోనే అత్యున్నత అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన ఇద్దరు విద్యార్థులు బంగారు పథకాలను సాధించారని తెలిపారు. దేశవ్యాప్తంగా అందిస్తున్న అనేక రకాల నూతన ప్రోగ్రాములు తెలంగాణ ప్రాంత విద్యార్థులకు అందుబాటులో తేవడంతో హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం ప్రముఖ పాత్ర పోషిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ కేంద్రం సహాయక సంచారకులు డాక్టర్ రాజు బోళ్ళ, ఆఫీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.