వెంగళరావునగర్, జనవరి 29: స్నేహితుడి బర్త్ డే వేడుకకు వెళ్లి వస్తూ.. వ్యాన్ ఢీకొని ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరినగర్‌కు చెందిన మహేశ్(22) టెన్నిస్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. సికింద్రాబాద్ పద్మారావునగర్‌లో జరిగిన మిత్రుడి జన్మదిన వేడుకకు తన దగ్గరి బంధువు ఎల్. కృష్ణ, స్నేహితుడు జె. ప్రదీప్‌తో కలిసి శుక్రవారం రాత్రి ఒకే బైక్‌పై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరు ముగ్గురు అర్ధరాత్రి 2.30 గంటలకు అమీర్‌పేట మైత్రీవనం కూడలికి చేరుకున్నారు. గ్రీన్ సిగ్నల్ పడటంతో ముందుకు వెళ్లబోయిన మహేశ్ వాహనానికి అడ్డుగా మరో ద్విచక్రవాహనం రావడంతో అతడిని మందలించాడు. ఆ సమయంలో ఎర్రగడ్డ నుంచి అమీర్‌పేట వెళ్తున్న డీసీఎం వాహనం అతివేగంతో దూసుకొచ్చి బైక్‌ను ఢీకొట్టింది. అంతకుముందే వెనుక కూర్చున్న స్నేహితులిద్దరు పక్కకు దూకి తప్పించుకున్నారు. మహేశ్ హెల్మెట్ ధరించినప్పటికీ.. బటన్ పెట్టుకోకపోవడంతో ఊడిపోయి ఎగిరిపోయింది. వ్యాన్ తలను బలంగా ఢీకొట్టడంతో.. తీవ్ర రక్రస్రావమై అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.