చిర్రెత్తిస్తున్నది.. స్లాట్ బుక్ చేయాలంటే..చుక్కలు కనిపిస్తున్నాయి. ఒక్క స్లాట్‌ను బుక్ చేయాలంటే.. 40 నిమిషాల వరకు టైం పడుతున్నది. ఒక్కోసారి అన్ని వివరాలు ఇచ్చాక.. ఓటీపీ రావడం లేదు..మళ్లీ ప్రయత్నించినా.. అదే సమస్య. ‘సతాయిస్తున్న సారథి’ని సరిచేయాలంటే.. అధికారులతో సాధ్యం కావడం లేదు.. పైగా సారథి సెంట్రల్ పోర్టల్ మాకేం తెలియదంటూ.. చెబుతున్నారు. చేసేదిలేక వాహనదారులు ఏజెంట్లు.. మీ సేవా కార్యాలయాలను సంప్రదిస్తున్నారు. వారేమో.. టెక్నికల్ ప్రాబ్లమ్స్ పేరిట డబ్బులు దండుకుంటున్నారు. సారథి ఇలా ఉంటే.. వాహన్ పోర్టల్ టాలెంట్ ఎలా ఉంటుందోనన్న ఆందోళన నెలకొంది.
Sarathi Portal | సిటీబ్యూరో, ఆగస్టు 23 ( నమస్తే తెలంగాణ ) : రవాణా శాఖ నిర్లక్ష్యం వాహనదారులకు శాపంగా మారింది. వాహన సేవలు అందించడంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇటీవల సారథి పోర్టల్‌ను అమలులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా లైసెన్స్ సేవలు అందించే వీలుంది. అయితే ఈ పోర్టల్ ప్రారంభం నుంచి అన్నీ సాంకేతిక సమస్యలే ఎదురవుతున్నాయి.
కనీసం స్లాట్ బుక్ చేయాలన్నా కుదరడం లేదు. సారథిలో స్లాట్ బుకింగ్‌పై వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఏజెంట్లు, మీ సేవా కార్యాలయాలను సంప్రదిస్తున్నారు. ఒక్క స్లాట్ బుక్ చేయాలంటే 40 నిమిషాల వరకు సమయం పడుతున్నది. ఉచితంగా స్లాట్ బుక్ అవ్వాల్సి ఉన్నా.. సాంకేతిక సమస్యలున్నాయంటూ.. రూ. 300 వరకు వసూలు చేస్తున్నారు. గతంలో సీఎఫ్ఎస్టీ సాఫ్ట్‌వేర్‌తో లైసెన్స్, రిజిస్ట్రేషన్ సేవలు అందేవి. ప్రత్యేకంగా తెలంగాణ ఫోలియో యాప్‌ను సైతం తీసుకొచ్చి అన్నీ సేవలను అందించారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదు.
అప్పుడుప్పుడు ఎదురయ్యే సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించే వీలు ఉండేది. ఇప్పుడు సారథి పోర్టల్ సమస్యలను పరిష్కరించాలంటే ఆర్టీఏ అధికారులతో సాధ్యం కావడం లేదు. రమా అనే ఓ వైద్యురాలు లైసెన్స్ కోసం సారథిలో స్లాట్ బుక్ చేశారు. అన్నీ వివరాలు ఇచ్చాక.. ఓటీపీ రాలేదు. మళ్లీ ప్రయత్నించి ఓటీపీ ఎంటర్ చేశాక.. మళ్లీ ఓటీపీ అవసరం పడిన సమయంలో రాలేదు. దీంతో గంటకుపైగా శ్రమించారు. ఫీజు చెల్లించే ఆప్షన్ వచ్చాక రూ.1100 చెల్లించారు.
కానీ స్లాట్ తేదీ కనిపించలేదు. ఇదేంటని అధికారులను ప్రశ్నించగా తమకేం తెలియదని, సారథి సెంట్రల్ పోర్టల్ అంటూ చేతులెత్తేశారు. దీంతో ఆమె అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యలు ప్రతీ కార్యాలయంలో ఎదురవుతున్నాయి. సారథి పోర్టల్‌తోనే ఇన్ని సమస్యలు వస్తే.. ఇక వాహన్ పోర్టల్ అందుబాటులోకి వస్తే రిజిస్ట్రేషన్లలోనూ ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని వాహనదారులు, ఇటు ఆర్టీఏ అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.