సిటీబ్యూరో: మీ ఇంటికి కొత్త కనెక్షన్ కావాలంటే అండర్‌గ్రౌండ్ కేబుల్ వేయాల్సిందే. లేకుంటే ఎస్టిమేషన్ దగ్గరే ప్రపోజల్ ఆగిపోతుంది. మీకు కొత్త కనెక్షన్ ఇవ్వడం కుదరదంటున్నారు విద్యుత్ అధికారులు. టీజీఎస్పీడీసీఎల్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు వినియోగదారులపై భారం మోపుతున్నాయి. ఒక కొత్త కనెక్షన్ తీసుకోవడానికి అయ్యే ఖర్చు కంటే ప్రస్తుతం డిస్కం పెట్టిన నిబంధనలతో యూ.ఈ కేబుల్ వేసుకుని చేయాలంటే కనీసం మూడురెట్ల ఖర్చు అవుతుందని వినియోగదారులు అంటున్నారు.
విద్యుత్ వినియోగదారులు అడిగినంత లోడ్ ఇవ్వకుండా గదుల ప్రాతిపదికన లోడ్ ఇవ్వాలని ఇటీవల నిబంధనలు విడుదల చేసిన డిస్కం అదే నిబంధనలలో ఓవర్‌హెడ్‌కు బదులుగా యూజీ కేబుల్ తప్పనిసరిగా ఉండాలంటూ నిర్దేశించింది. దీంతో కనెక్షన్ కోరుతున్న వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఐప్లె చేసుకున్న కాంట్రాక్టర్లు, వినియోగదారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
వారు తప్పనిసరిగా యూజీ వేసుకోవాలంటే మున్సిపల్ శాఖ అనుమతి కావాల్సి వస్తుంది. ఎక్కడైతే అండర్ గ్రౌండ్ వేస్తామో ఆ ప్రాంతంలో ఉన్న రోడ్లను తవ్వడంతో పాటు చుట్టుపక్కల వారికి కూడా కొంత ఇబ్బందిగా మారే అవకాశమున్నది. ఈ విషయంలో పునరాలోచించాలని సీఎండీకి చాలా మంది చెప్పినా డిస్కంలో ఉన్న ఒక డైరెక్టర్ నిర్ణయాలను సీఎండీ అమలు చేస్తున్నారని, ఆయనకు క్షేత్రస్థాయి ఇబ్బందులు తెలియదని సిబ్బంది వాపోతున్నారు.
యూజీ కేబుల్ సాధ్యమేనా..!
మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్, హైరైజ్డ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్లు, సాధారణ గృహాల్లో కొత్త కనెక్షన్లు తీసుకోవాలంటే కచ్చితంగా అండర్‌గ్రౌండ్ కేబుల్ వేసుకోవాలని డిస్కం నిర్ణయించింది. ఈ మేరకు సీఎండీ ఆదేశాలు జారీ చేశారు. పది సర్కిళ్లలో ఈ కొత్త కనెక్షన్ల సమస్య తలనొప్పిగా మారింది. సీఎండీ ఆదేశాలతో అండర్‌గ్రౌండ్ కేబుల్ వేయాలంటే మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలి. ఒకసారి రోడ్డు తవ్వకాలు చేయాలంటే మీటర్‌కు దాదాపు రూ. 3800 వరకు చెల్లించాల్సి వస్తోంది.
అంతేకాకుండా రోడ్డు తవ్వడం, తిరిగి పూడ్చడం చేయాలంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది. గ్రౌండ్లో నల్లా పైపులు, ఇతరత్రా కనెక్షన్లు ఉంటే వాటి విషయంలో కూడా తవ్వకాలు జరిపేటప్పుడు ఏదైనా జరిగితే అది కూడా తలనొప్పేనని కాంట్రాక్టర్లు, వినియోగదారులు అంటున్నారు. కాగా, ఒక కనెక్షన్ తీసుకోవడానికి సుమారు రూ.70వేలు సాధారణ స్థితిలో ఖర్చయితే తాజా నిబంధనలతో రూ. 2.10 లక్షలు ఖర్చవుతుందని అది కూడా మున్సిపల్ పర్మిషన్ ఇస్తేనే పనులు పూర్తయ్యే వరకు మరెంత పెరుగుతుందోనంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.