హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం అల్లాపూర్‌లోని సున్నం చెరువు ప్రాంత భూవివాదంపై లోతుగా విచారణ చేపట్టాలని దర్యాప్తునకు నియమితులైన ప్రత్యేకాధికారికి హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విచారణ అధికారిగా రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) స్థాయి అధికారిని నియమించింది. హైడ్రా సహా ఉన్నతాధికారుల ప్రభావానికిలోను కాకుండా స్వతంత్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది.
విచారణ జరిపే అధికారి నివేదిక రూపొందించేందుకు రంగారెడ్డి, మెదక్ మలాజిగిరి జిల్లాల నీటిపారుదల, సర్వే, భూ రికార్డులు, రెవెన్యూ శాఖల అధికారుతో పాటు జీహెచ్ ఎంసీ డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేకాధికారికి తగిన సహకారం అందించాలంది. సర్వేచేపట్టే ముందు పిటిషనర్‌ను సంప్రదించాలని ప్రత్యేకాధికారిని ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 23కు వాయిదా వేస్తూ జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. తమకు నోటీసులు జారీ చేయకుండా, ఎఫ్టీఎల్ నిర్ధారించకుండా అక్రమ నిర్మాణాల పేరుతో హైడ్రా కూల్చివేతలకు పాల్పడుతోందని పేరొంటూ.. ఎస్ఐఈటీ మారుతీహిల్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సహా ఏడుగురు పిటిషన్లు వేశారు.
సున్నం చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు అనుమతించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు మాదాపూర్ పోలీసుల సాయం తీసుకునేందుకు అనుమతించాలని హైడ్రా మధ్యంతర పిటిషన్ వేసింది. తొలుత పిటిషనర్ న్యాయవాది వాదిస్తూ, హైడ్రా చెరువు సమీపంలో తవ్వకం పనులను నిరాటంకంగా కొనసాగిస్తోందని చెప్పారు. మరోవైపు ట్యాంకర్ల ద్వారా చెరువు నుంచి నిరంతరం కలుషితమైన నీటిని తోడి తాగునీటి అవసరాల కోసం సరఫరా చేస్తోందన్నారు. హైడ్రా తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ మహమద్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్ల వాదనలు అవాస్తవమన్నారు. అధికారుల విచారణలో ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లోలో విల్లాలున్నా కూడా కూల్చివేస్తామని చెప్పారు. చెరువు సహజ స్థితిని పునరుద్ధరించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
వాదనలపై స్పందించిన హైకోర్టు, ఎఫ్టీఎల్ నిర్మాణాలు చేపట్టే వారికి బోర్లు వేసుకునేందుకు అనుమతి ఎలా ఇచ్చారని అధికారులను నిలదీసింది. నల్లా, విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించింది. కలుషిత నీటి తరలింపును నిరోధించేందుకు నిషేధిత ప్రాంతంలోని బోరు బావులకు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని విద్యుత్ శాఖకు ఆదేశించింది. సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ప్రత్యేకాధికారిని ఆదేశించింది. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో వెలసిన అన్ని ఆస్తుల వివరాలను ఇంటి నంబర్లతో సహా సమర్పించాలని ఆదేశించింది. ప్రత్యేకాధికారి ఇవ్వబోయే నివేదికలో హైడ్రా తప్పు చేసినట్లు తేలితే, కఠిన చర్యలకు ఉత్తర్వులను జారీ చేస్తామని హెచ్చరించింది. విచారణను 23కి వాయిదా వేసింది.