
సిటీబ్యూరో, జనవరి 9(నమస్తే తెలంగాణ): కీసర పోలీసు స్టేషన్లో ఇటీవల నమోదైన మొబైల్ ఫోన్ల మిస్సింగ్ దర్యాప్తులో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఏపీకి చెందిన కొన్ని ముఠాలు మైనర్లను ఎంపిక చేసుకొని..వారికి సంతలో మొబైల్ ఫోన్లు చోరీ చేసి తెచ్చిస్తే.. నెలకు రూ. 10 వేల వేతనం చెల్లిస్తున్నట్లు తేలింది. పోలీసుల విచారణలో ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రధాన సూత్రధారి కోసం
గాలిస్తున్నారు.
గదిలో సుమారు 25 ఫోన్లు..
రెండు మొబైల్ ఫోన్లు మిస్సింగ్ అయ్యాయని ఫిర్యాదు రావడంతో దర్యాప్తు చేసిన పోలీసులు ట్రాకింగ్ పెట్టారు. ఓ ఫోన్‌కు సంబంధించిన సిగ్నల్స్ అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని ఓ ఇంటి ఆచూకీని చూపించింది. అక్కడికి వెళ్లగా, గదిలో ఒడిశాకు చెందిన రాము, రాజా దాసులతో పాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు గుర్తించారు. మిస్సింగ్ ఫోన్‌కు సంబంధించిన ఆరా తీసినప్పుడు.. ఓ బాలుడు మొబైల్‌ను తీసి ఇచ్చాడు. అనుమానం వచ్చిన పోలీసులు.. గదిలో తనిఖీలు చేయగా, దాదాపు 25 మొబైల్ ఫోన్లు కనిపించాయి. మైనర్లతో పాటు రాము, రాజా దాసులను విచారించగా, ఫోన్లు కొట్టుకొస్తే.. ఏపీకి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి నెలకు రూ.10 వేల జీతం ఇస్తున్నాడంటూ.. మొత్తం విషయాలు చెప్పారు. వారందరిని అరెస్టు చేసిన పోలీసులు ప్రధాన సూత్రధారి కోసం వెతుకుతున్నారు.
శివారు సంతలపైనే గురి..
ఏపీ చెందిన కొన్ని ముఠాలు 12 నుంచి 17 సంవత్సరాల మైనర్లను ఎంచుకొని.. వారికి రూ. 10వేల వేతనం ఇచ్చి.. నగర శివారులో ఓ గది తీసుకుని అందులో ఉంచుతున్నారు. వారికి భోజనం, వసతి, దుస్తులు సామగ్రిని కూడా సమకూరుస్తున్నారు. రద్దీగా ఉండే సంతకు ముఠా సూత్రధారి వారిని ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లి.. వదిలేస్తాడు. రెండు కిలోమీటర్లు దూరంలో నిల్చుంటాడు. బాలలు ఫోన్లు తస్కరించి రాగానే.. వారిని రూమ్‌కు తెచ్చి వదిలేసి… ఫోన్లన్నింటిని స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. వంద మొబైల్స్ జమకాగానే సిమ్‌కార్డులు తీసేసి.. ఇతర రాష్ర్టాలకు చెందిన వారికి విక్రయిస్తాడు. ఒక సంతలో తిరిగే మైనర్లు సుమారు ఐదు ఫోన్లు కచ్చితంగా కొట్టేస్తారని తెలిసింది.