హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో అదనంగా విద్యుత్ వినియోగం పెరిగిందంటూ దానికి ప్రజలే వ్యక్తిగతంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలని జనంపై భారం మోపేందుకు సిద్ధమైన ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నగరంలోని అపార్ట్మెంట్ సముదాయాల్లో విద్యుత్ వినియోగం 20 కిలోవాట్ (కేవీ) దాటితే ఆయా అపార్ట్మెంట్ వాసులు సొంతంగా ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసుకోవాలని టీఎస్ఎస్పీడీసీఎల్ నోటీసులిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన విద్యుత్ వినియోగానికి అనుగుణంగా నిర్వహణ చేతగాక ప్రభుత్వం ప్రజలపై భారం వేసే తుగ్లక్ చర్యకు పూనుకుందని ధ్వజమెత్తారు. విద్యుత్ ట్రాన్ఫార్మర్ల విషయంలో ప్రజలపై ఎలాంటి భారం మోపకుండా వాటిని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ వినియోగం పెరిగితే ఆ భారం ప్రజలపై వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్లో వినియోగం పెరిగిందని పైప్లైన్లు, రోడ్లను కూడా వేసుకోమని అనేట్టు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. పెరిగిన అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్న విషయాన్ని రేవంత్రెడ్డి సరార్ మరిచిపోయినట్టు ఉందని ఎద్దేవా చేశారు.
రూ. 300 కోట్ల అదనపు భారం..
20 కేవీల విద్యుత్ లోడ్ దాటిన అపార్ట్మెంట్లో సొంతంగా ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసుకోవాలంటే ఒకో అపార్ట్మెంట్కు దాదాపు రూ. 3 లక్షలు అవసరమవుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఒకో కుటుంబంపై రూ. 30వేల నుంచి రూ. 50 వేలు భారం వేసేందుకు నిర్ణయం తీసుకోవటమేనన్నారు. ఈ లెక్కన హైదరాబాద్లో 20 కేవీ పైగా విద్యుత్ వినియోగం చేసే అపార్ట్మెంట్లలో కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకుంటే ప్రజలపై రూ.300 కోట్ల భారం పడుతుందని వివరించారు. పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే ఆ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. వినియోగం పెరిగితే అందుకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం తప్పించుకోవటం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.ప్రజలకు మౌలిక వసతుల కల్పన బాధ్యత ప్రభుత్వానిదేననే విషయాన్ని రేవంత్రెడ్డి ప్రభుత్వం గుర్తించాలన్నారు.
కరెంట్ కోతలపై ప్రశ్నిస్తే..
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తారని ఆశపడి ఓట్లేసినందుకు రేవంత్రెడ్డి ప్రజలకు షాక్ ఇస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేయకుండానే అనుమతించిన అధికారులను, వాటిని అమ్మిన బిల్డర్లను వదిలేసి అపార్ట్మెంట్వాసులపై భారం మోపుతారా అని ప్రశ్నించారు. ఇప్పటికే లోడ్ పెరిగిందని అప్రకటిత కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కరెంట్ కోతలపై ప్రశ్నిస్తే ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చర్య ఎట్టి పరిస్థితుల్లో సమర్ధించలేనిదని ఆయన తేల్చిచెప్పారు. ఈ విషయంలో సీఎం స్పందించాలని, లేదంటే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని హెచ్చరించారు.