సిటీబ్యూరో/ఖైరతాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : “మా ఇండ్లు నేలమట్టం చేసే అభివృద్ధి మాకక్కర్లేదు. సుందరీకరణ కోసం మేం నాశనం కావాలా? ఎవడో ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మా ఇండ్లను కూల్చడానికి చూస్తున్నారా? ఎన్నో ఏండ్లుగా ఉంటున్నాం. అనేక వరదలు వచ్చాయి. మమ్మల్ని ఏ వరద ఏం చెయ్యలేదు. మమ్మల్ని మేం కాపాడుకుంటాం. మా ఇండ్లను కూల్చే అధికారం మీకెవరిచ్చారు.
సీఎం డౌన్ డౌన్.. కూల్చివేతలు జరిగితే మూసీ నిర్వాసితులమంతా రేవంత్ మీ ఇంట్లో ఉంటాం. ఖబడ్దార్.” అంటూ మూసీ నిర్వాసితులు హెచ్చరించారు. హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట సుమారు 200 మంది మూసీ నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నిర్వాసితులకు మద్దతుగా సీపీఎం, ఇతర ప్రజా సంఘాలు నిలిచాయి. ఈ సందర్భంగా మూసీ సుందరీకరణతో కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకోవాలనుకుంటున్నారని నిర్వాసితులు ఆరోపిం చారు. ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్ రూంలు ఇచ్చుకోండి.. తమకు అవసరం లేదని మూసీ నిర్వాసితుడు రమణ స్పష్టం చేశారు.
మా ఘోస తగులుతుందని శారద అనే మహిళ కన్నీటిపర్యంతమైంది. సుందరీకరణ చేయాలంటే పేదల ఇండ్లే కావాలా.. తమను రోడ్డుపై పడేస్తారా అంటూ అంబర్పేట గోల్నాక మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అనంతరం సీపీఎం నగర కార్యదర్శి ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వం బస్తీవాసులతో ఎలాంటి చర్చలు జరుపకుండా రెండు రోజుల సమయం ఇచ్చి ఖాళీ చేయాలనడం దుర్మార్గమైన చర్య అన్నారు.
మూసీ నిర్వాసితుల సంఘం కన్వీనర్ ఎం.మహేందర్ మాట్లాడుతూ గోల్నాక డివిజన్లోని మూసీ పరీవాహక ప్రాంతంలో కూల్చివేస్తామన్న స్థలం ఎంతో ఎత్తులో ఉందని, ఇండ్లకు పట్టాలతో పాటు కరెంటు, నల్లా బిల్లు, ఆస్తి పన్నులు కడుతున్నారని తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో జి. రాములు, ఉమాదేవి, మల్లేశ్ గౌడ్, దుర్గా, మహేశ్, ప్రసాద్ రెడ్డి, కిరణ్ పాల్గొన్నారు.