LRS | సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ల్యాండ్ రెగ్యులరైజేషన్ పథకంపై ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకుంటే… తట్టెడు మంది కూడా స్పందించలేదు. దీంతో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల ద్వారా వేల కోట్ల ఆదాయం ఆడియాశలయ్యాయి. మార్చి 31 వరకు ఫీజులు చెల్లించిన వారికి 25శాతం రాయితీ ఇచ్చినా.. దరఖాస్తుదారులు ముందుకు రాలేదు.
దీంతో గడువు ముగియడంతో.. ఏప్రిల్ 30 వరకు 25శాతం రాయితీ సదుపాయాన్ని పొడిగించింది. హెచ్ఎండీఏ పరిధిలో 3.45లక్షల మంది, జీహెచ్ఎంసీ పరిధిలో 1.5లక్షల మంది తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో నెలకొని ఉన్న స్తబ్ధత కారణంగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియకు ఆశించిన స్థాయిలో ఆదరణ రాలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏప్రిల్ నెలాఖరు వరకు గడువు పెంచారు.