సిటీబ్యూరో, మార్చ్ 29(నమస్తే తెలంగాణ): గడువులోగా బిల్లు కట్టనివారికి విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఎస్పీడీసీఎల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కరెంట్ మీటరు రీడర్లకు లక్ష్యాలు విధించి అమలు చేసే బాధ్యతను అప్పగించారు. నెలలో 10రోజులు మాత్రమే మీటరు రీడర్లు పనిచేస్తుండగా మిగతా రోజుల్లో కూడా పనిచేసేందుకు వీలుగా ఈ బాధ్యతలు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. టీజీఎస్పీడీసీఎల్లో సుమారు 15వందల మంది మీటరురీడర్లుండగా వారిలో ప్రతీ మీటరు రీడరు నెలకు వంద కనెక్షన్లను తనిఖీ చేసి కరెంట్ బిల్ కట్టకపోతే సరఫరా నిలిపివేయాలంటూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
మూడునెలల నుంచి కరెంట్ బిల్లులు కట్టకుండా ఇంటికి తాళం వేసిఉంటే నిజమా కాదా అనేది మీటరు రీడరు తనిఖీ చేయాలి. చాలా ఇళ్లల్లో అన్ని అవసరాలకు కలిపి ఒకే కనెక్షన్ తీసుకోవడం, ఇతర అవసరాలు లేకున్నా వేర్వేరు కనెక్షన్లు తీసుకున్నవారు ఉన్నారు. నెలకు ఇలాంటి 200 కనెక్షన్లు తనిఖీ చేయాలని సీఎండీ జితేష్ వీ పాటిల్ సూచించారు. చాలామంది బిల్లులు చెల్లించకపోవడంతో సంస్థకు భారీనష్టం వాటిల్లుతున్నదని, లైన్మెన్లు కరెంట్ కట్ చేయడానికి వెళ్తే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో లైన్మెన్లకు ఉన్న ఇతర బాధ్యతలు వారు నిర్వర్తించేలా ఇళ్లల్లో కరెంట్ కనెక్షన్లపై ఓ నజర్ వేసేలా మీటర్ రీడర్లకు బాధ్యతలు అప్పగించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కరెంట్ బిల్లులు చెల్లించకుండా ఉన్న కనెక్షన్లను గుర్తించి విద్యుత్ సరఫరా నిలిపివేసేందుకు డిస్కం మీటరు రీడర్లకు లక్ష్యాలు విధించింది. మీటర్ రీడర్లు తనిఖీలు చేసి స్థానిక అధికారులకు వివరాలు అందజేస్తే లైన్మెన్లు స్తంభమెక్కి సరఫరా నిలిపివేస్తారు.
ఇదిలా ఉంటే గ్రేటర్‌లోని పలు విద్యుత్ సర్కిళ్లలో విద్యుత్ బిల్లుల వసూళ్లు భారీగా తగ్గాయి. ఈనెల మొదటివారంలో మీటరురీడర్లు ఆందోళన చేయడంతో చాలాచోట్ల బిల్లులు తీయలేదు. మరోవైపు బిల్లులు చేతికందకపోవడంతో బిల్లులు కట్టడంలో కూడా ఆలస్యమైనట్లు ఎస్పీడీసీఎల్ అధికారి ఒకరు చెప్పారు. ప్రతీనెలా 28వ తేదీనాటికి 90శాతం విద్యుత్ బిల్లులు వసూలవుతుండగా ఈసారి 70శాతం మాత్రమే వసూలైనట్లు సమాచారం. మీటరు రీడర్ల స్ట్రైక్‌తో పాటు క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బిల్లులు వసూలు చేయడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.