నేరేడ్మెట్, ఫిబ్రవరి 6 : ప్రజలు విలువైన వస్తువులు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు అన్నారు. ప్రజలు పోగొట్టుకున్న రూ.3కోట్ల విలువచేసే 1016 మొబైల్ ఫోన్లను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకుని.. బాధితులకు అందజేశారు. గురువారం రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. విలువైన వస్తువులను దొంగలించినప్పుడు సీఈఐఆర్ వెబ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఎల్బీ నగర్, మల్కాజిగిరి, బోనగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో పోయిన మొత్తం 1016 మొబైల్ ఫోన్లను రికవరీ చేయగా.. వీటి విలువ సుమారు రూ.3 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు.
ప్రజలు ఎవరూ పాత మొబైల్ ఫోన్లను కొనరాదని సీపీ విజ్ఞప్తి చేశారు. మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని, నేరస్తులు మొబైల్ ఫోన్లను దొంగిలించి దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. రికవరీ అయిన ఫోన్లను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు మాట్లాడుతూ.. పోయిన ఫోన్లు తిరిగి రావే మో అని ఎంతో బాధ అనుభవించామని, తిరిగి మాకు ఫోన్లు దొరికినందుకు రాచకొండ కమిషనర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఫోన్లను రికవరీ చేయడంలో కృషిచేసిన క్రైమ్ డీసీపీ అరవింద్‌బాబు, ఏసీపీ కరుణాసాగర్, సీసీఎస్ స్పెషల్ టీం, ఐటీ సెల్ అధికారులను సీపీ అభినందించారు.