గ్రేటర్లో ఇప్పటికే లక్షా20వేల ఆటోలు
వాటికి అదనంగా తిరుగుతున్న ఇతర జిల్లాల ఆటోలు
పెట్రోల్, డీజిల్ ఆటోలకు నో పర్మిట్
పెరుగుతున్న ట్రాఫిక్, కాలుష్యం తీవ్రత
రావొద్దని హెచ్చరిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
సిటీబ్యూరో, మార్చి 1 ( నమస్తే తెలంగాణ ) :ఇతర జిల్లాల ఆటోలు కనిపిస్తే.. రూ.2 వేల నుంచి రూ.6వేలు జరిమానా విధిస్తామని నగర ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. గ్రేటర్లో పర్మిట్ ఉన్న ఆటోలు కాకుండా ఇతర జిల్లాల ఆటోలు విచ్చల విడిగా నడుస్తున్నాయి. నిబంధనల ప్రకారం గ్రేటర్లో టీఎస్009, టీఎస్010, టీఎస్011, టీఎస్012, టీఎస్013 వరకు రిజిస్ట్రేషన్ ఉన్న ఆటోలు మాత్రమే నడవాల్సి ఉంటుంది. ఈ లెక్కన గ్రేటర్లో లక్షా20వేల ఆటోలు ఉన్నాయి. అయితే వీటికి మించి ఇతర జిల్లాల నుంచి సుమారు 70 వేల ఆటోలు నగరంలో తిరుగుతున్నాయి. దీంతో గ్రేటర్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో పాటు కాలుష్యం తీవ్రత పెరగడం ఆందోళనకు దారి తీస్తుంది. ఈ పరిస్థితుల్లో నగర ఆటో డ్రైవర్లు ఇతర జిల్లాలకు చెందిన ఆటోలు గ్రేటర్లోకి రావొద్దంటూ ఆందోళన బాటపట్టారు. ట్రాఫిక్ పోలీసులు కూడా ఇతర జిల్లాల ఆటోలు నగరంలోకి రావొద్దంటూ జరిమానాలు విధిస్తున్నారు.
కొత్తపర్మిట్లు లేవు..!
2002లో బురెలాల్ కమిటీ గ్రేటర్లో కాలుష్య తీవ్రతను అంచనా వేసి.. ఆటోల సంఖ్య ఎంత ఉండాలి? పెట్రోల్, డీజిల్‌తో కలుగుతున్న అనర్థాలు ఏంటీ? అనే విషయాలపై అధ్యయనం చేసి అప్పటి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నగరంలో 70వేల ఆటోలు ఉన్నాయని.. అంతకు మించి కొత్త ఆటోలకు అనుమతి ఇవ్వకూడదని ఆ నివేదికలో తెలిపింది. అప్పటినుంచి ప్రభుత్వం ఆటో రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది.
సీఎన్జీ, ఎల్పీజీ ఆటోలు మాత్రమే..!
సీఎన్జీ, ఎల్పీజీ ఆటోలు మాత్రమే నగరంలో నడపాలని ఆదేశాలిచ్చారు. అప్పటి నుంచి ఆటోలన్నీ ఎల్పీజీ, సీఎన్జీకి మార్చుకుని ఆటోలు నడుపుతున్నారు. అయితే కొత్త ఆటోలు కొనుగోలు చేయాలంటే పాత ఆటోను తుక్కు చేసి అదే ఆటో పర్మిట్ మీద కొత్త ఆటో తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని కొత్త ఆటో కొనుగోలుకు అవకాశం లేదని జీఓ జారీ చేశారు. అనంతరం 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్త జీఓతో అప్పటి అవసరాలకు అనుగుణంగా మరో 20వేల కొత్త ఆటోలకు అనుమతి ఇచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మైనార్టీ సంక్షేమంలో భాగంగా 2వేల ఎల్పీజీ ఆటోలకు పర్మిట్ ఇచ్చారు. అయితే ఇవే కాకుండా ఇతర జిల్లాల్లో రిజిస్ట్రేషన్ అయిన ఆటోలు నగరంలో తిరుగుతున్నాయి.
2వేల నుంచి 6వేల వరకు జరిమానా..!
నగరంలో ఉన్న చాలా మంది డ్రైవర్లు ఇతర జిల్లాల్లో ఆటోలు కొనుగోలు చేసి నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ నడుపుతున్నారు. అయితే వారంతా నగరానికి చెందినవారే కావడంతో ఆ ఆటోలు ఇతర జిల్లాలో నడపలేని పరిస్థితి. ఏ ఆటో అయినా రిజిస్ట్రేషన్ ఆర్టీఓ పరిధి 60 కిలో మీటర్ల లోపున రాకపోకలు సాగించాలని ఆర్టీఓ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని పరిసరాలు గ్రేటర్లోకి వస్తున్నాయి. అయితే రంగారెడ్డి, మేడ్చల్ వాహనాలకు జీహెచ్ఎంసీలో అనుమతి ఉంది. కానీ వికారాబాద్, పరిగి, భువనగిరి, సంగారెడ్డి తదితర జిల్లాలకు చెందిన ఆటోలు నగరంలో అధికంగా తిరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. వాటికి 2వేల నుంచి 6వేల వరకు జరిమానా విధిస్తున్నారు.