గచ్చిబౌలిలోని టెలికాంనగర్ కాలనీ పార్కులో వెలసిన నిర్మాణాలను హైడ్రా అధికారులు గురువారం తొలగించారు. పార్కు స్థలంలో వెలసిన గదులను జేసీబీ సహాయంతో తొలగించి.. చుట్టూ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసి.. బోర్డులు పాతారు. అయితే చిన్నపాటి గదులు నిర్మించుకొని తాత్కాలికంగా నివసిస్తున్న తమను ఖాళీ చేయిస్తున్న హైడ్రా అధికారులు.. పేదలపైనే పడుతున్నారని, గతంలో చోటుచేసుకున్న ఆక్రమణల జోలికి వెళ్లకుండా తమను మాత్రమే రోడ్డున పడేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
– శేరిలింగంపల్లి, జనవరి 22
గచ్చిబౌలి టెలికాంనగర్ పేరిట బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు 1982లో 32 ఎకరాల పరిధిలో అప్పటి హుడా అనుమతితో లే అవుట్ వేశారని ఇందులో 4వేల గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించినట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలో ఇందులో 1500 గజాల వరకు ఆక్రమణలు జరిగిపోయాయని, శాశ్వత నివాసాలు, ఇండ్లు వెలిశాయని మిగిలిన 2500 గజాల స్థలంలో కూడా ప్లాట్లున్నాయంటూ కొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నారని టెలికాం నగర్ నివాసితులు ఇటీవల హైడ్రాను ఆశ్రయించారు.
హైడ్రా ప్రజావాణిలో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 2500 గజాల పార్కు స్థలంలో నెలకొన్న గదులను తొలగించి.. పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు.
హైడ్రా అధికారులు పేదలపైనే తమ ప్రతాపం చూపుతున్నారని, పెదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం చేస్తున్నారని టెలికాంనగర్ బాధిత గుడిసెవాసులు అరోపిస్తున్నారు. తాము 20 సంవత్సరాల తరబడి ఇక్కడ నివసిస్తున్నామని, ఒక్కసారిగా పోలీసులతో వచ్చి తమను అర్ధాంతరంగా ఖాళీ చేయిస్తే తమ ఎక్కడికి పోవాలని బాధితులు బాలమణి, మల్లేష్, దేవమ్మ, అంజి, మాశప్పలు ఆవేదన వ్యక్తం చేశారు. పెదల గదులను ఉన్నపలంగా నేలమట్టం చేస్తున్న హైడ్రా పెద్దల విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఇదే పార్కు స్థలంలో గతంలో ఆక్రమణలు చేపట్టి ఇండ్లు నిర్మించుకున్న పెద్దల జోలికి ఎందుకు వెళ్లడం లేదని మండిపడ్డారు. పెద్దలను వదలి పేదలపైనే తమ ప్రతాపం చూపుతున్నారని మండిపడ్డారు. చంటి పిల్లలతో ఉన్న తమను ఒక్కసారిగా హైడ్రా అధికారులు రోడ్డున పడేస్తున్నారని బోరుమన్నారు.


