Hyderabad | గోల్నాక, జూన్ 24 : సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ గత సోమవారం ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. డివిజన్ పటేల్ నగర్ చౌరస్తాలో గత కొన్ని రోజులుగా సీపీఎల్కి అనుకొని ఉన్న ప్రేమ్ నగర్ నాలా రిటైనింగ్ వాల్ నుండి గత కొన్నినెలలుగా మురుగు నీరు రోడ్డుపైకి రావడంతో స్థానికులతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ విషయాన్ని ఎన్నో సార్లు సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించుకోక పోవడంతో సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ నాయకులతో కలసి ధర్నా చేపట్టారు. కార్పొరేటర్ ధర్నాకు ఎట్టకేలకు నాలా అభివృద్ధి పనుల బాధ్యత చేపట్టిన హైడ్రా అధికారులు మంగళవారం రంగంలోకి దిగారు. నాలా వద్ద సమస్యను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన అధికారులు యద్ధ ప్రాతిపదికన తమ సిబ్బందిచే నాలాలో పూడికతీత పనులు చేపట్టారు. ఈ పనులను కార్పొరేటర్ దగ్గరుండి పరిశీలించారు. వీలైనంత త్వరగా నాలా ప్రహరీ గోడ నిర్మిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లవంగు ఆంజనేయులు, రంగు సతీష్ గౌడ్, మహేష్ ముదిరాజ్, అజర్, శ్రావణ్, సంతోష్ చారి, స్థానిక బస్తీ ప్రజలు పాల్గొన్నారు.