Hydraa | శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 7 : నగరంలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్రకటనల యూనిపోల్స్‌ను శుక్రవారం హైడ్రా తొలగించినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారికి ఇరువైపుల అనుమతులు తీసుకోకుండా భారీ హోర్డింగులు ఏర్పాటు చేసి .. ప్రభుత్వానికి రుసుములు చెల్లించని వాటిపై చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు మార్గంలో ప్రకటనల హోర్డింగులను ముందస్తుగా తొలగిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. మున్సిపాలిటీ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు తొలగిస్తున్నట్లు తెలిపారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో తొలగిస్తున్న హోర్డింగులను పరిశీలించిన్నట్లు పేర్కొన్నారు.
శంషాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 140 హోర్డింగులు ఉన్నాయి. వాటిలో 130కి అనుమతి ఉంది. 2023 వరకు వాటి నుంచి రుసుములు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో 10 హోర్డింగులకు ఎలాంటి అనుమతి లేదని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు వాటిపై చర్యలు తీసుకుంటున్నట్లు రంగనాథ్ మీడియాకు వివరించారు. హోర్డింగ్‌ల ద్వారా ఏడాదికి దాదాపు కోటి రూపాయలకు పైగా ఆదాయం వస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సుమన్‌రావు తెలిపారు. వాటిని 2023 నుంచి రుసుము తీసుకోవడంలేదని చెప్పారు.