బంజారాహిల్స్, ఏప్రిల్ 16: బంజారాహిల్స్ రోడ్ నం.12లోని మంత్రుల నివాసాలకు సమీపంలో రోడ్డు విస్తరణ పేరుతో పేదల ఇండ్ల కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సుమారు 50 ఏండ్లుగా రోడ్డును ఆనుకుని కొనసాగుతున్న రెండు షాపులను గురువారం జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు నేలమట్టం చేశారు. నోటీసులు లేకుండా కూల్చివేతలు ఎలా చేస్తారని.. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఉంటున్న ఓ మంత్రి ఆదేశాలతో రోడ్డు విస్తరిస్తామంటూ జీహెచ్ఎంసీ అధికారులు పేదలకు చెందిన షాపులు కూల్చారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయని, తమ ఇండ్ల జోలికి ఎవరూ రాలేదని బాధితుడు మహ్మద్ మహమూద్ ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేతలు చేసిన తర్వాత పక్కనున్న మరో పది ఇండ్లకు కూడా మార్కింగ్ చేశారని, వారం రోజుల్లో వెనక్కి జరగకపోతే మళ్లీ వచ్చి జేసీబీలతో కూలుస్తామని బెదిరింపులకు దిగారని స్థానికంగా బైక్ మెకానిక్ షాపు నిర్వహించే జాకీర్ హుస్సేన్ అన్నారు.
రోడ్డుకు రెండోవైపున ప్రైవేటు వ్యక్తులు ఫుట్‌పాత్‌పై భారీ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుని ఆక్రమిస్తే వారి జోలికి వెళ్లలేదని, పేదల ఇండ్లపైకి మాత్రం బుల్డోజర్ పంపించడం దారుణమని ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతల విషయం తెలుసుకున్న ఆయన అక్కడకు చేరుకొని బాధితులతో మాట్లాడారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆదేశాలతో పేదల పొట్టకొట్టారని, రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా పేదలకు నిలువనీడ లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.