సిటీబ్యూరో, నవంబర్ 5(నమస్తే తెలంగాణ): అమీన్పూర్లో పార్కులు, రహదారులు కబ్జాకు గురైనట్లు ఫిర్యాదులు రావడంతో మంగళవారం హైడ్రా బృందం ఆ ప్రాంతంలో సర్వే నిర్వహించింది. అమీన్పూర్లో ఎకరాకు పైగా ఉన్న పార్కు స్థలంతో పాటు రహదారులను గోల్డెన్ కీ వెంచర్ వాళ్లు కబ్జా చేశారంటూ వెంకటరమణ కాలనీ వాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ స్థలం విషయంలో ఇరు పక్షాల వారు కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా సర్వే జరిపించింది. మొత్తం ఐదు సర్వే నంబర్లలోని 150 ఎకరాలకు పైగా ఉన్న స్థలాన్ని జేడీ, సర్వే కార్యాలయ సిబ్బంది సర్వే చేశారు. వెంకటరమణ కాలనీ, చక్రపురి కాలనీ వాసులు, గోల్డెన్ కీ వెంచర్ నిర్వాహకులతో పాటు పరిసర కాలనీ వాసులు, గ్రామస్థుల సమక్షంలో ఈ సర్వే నిర్వహించారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు హైడ్రా బృందం స్థానికులతో అభిప్రాయసేకరణ జరిపింది. ఇందులో ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయి? ఏయే ప్రాంతాల్లో కబ్జాలతో స్థానికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న అంశాలపై కాలనీ వాసుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. మరో వైపు సర్వే నంబర్లు తారుమారుతో చేసిన వెంచర్లపై కూడా హైడ్రా దృష్టి పెట్టింది. సర్వే నంబర్ – ఆరుకు సంబంధించిన అనుమతులతో సర్వే నంబర్ – 12లోని ప్రభుత్వ భూమిని తమకు అమ్మారంటూ వచ్చిన ఫిర్యాదుపై కూడా హైడ్రా సర్వే అధికారులతో చర్చించి ఆ రెండు స్థలాలకు సంబంధించిన రిపోర్ట్‌ను కోరింది.
లే అవుట్లను పరిశీలించి సర్వే నంబర్లు, హద్దురాళ్ల ఆధారంగా భూముల సరిహద్దులు నిర్ణయించి పార్కు స్థలాలతో పాటు రహదారుల ఆక్రమణలపై నివేదిక రూపొందించి తదుపరి చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు చెప్పారు. ఈ సర్వేలో హైడ్రా బృందంతో పాటు హెచ్ఎండీఏ, మున్సిపాలిటీ, రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.