జూబ్లీహిల్స్, జులై 9: యూసుఫ్ గూడా డివిజన్ శ్రీకృష్ణానగర్ ముంపు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, డీసీ జాకియా సుల్తానా పర్యటించారు. ఈ సందర్భంగా పూర్ణ టిఫిన్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో వీధుల్లో పేరుకుపోయిన బురద నీటితో కలుగుతున్న అసౌకర్యంపై స్థానికుల ఫిర్యాదులను పరిశీలించారు. అపరిష్కృత సమస్యగా మారిన కృష్ణానగర్ చిన్నపాటి వర్షాలకే బురద గుంటగా మారుతున్నది. లోతట్టు ప్రాంతం కావడంతో చిన్న వర్షానికే వరదలో మునుగుతోంది. ఎగువ ప్రాంతాలైన జూబ్లీహిల్స్, హైలం కాలనీ మీదుగా వచ్చే వరద నీరు ఒకవైపు.. వెంకటగిరి నుంచి ప్రవహించే వర్షం నీరు మరోవైపు కృష్ణానగర్ని ముంచెత్తుతున్నాయి.
అయితే, వెంకటగిరి అజయ్ బార్ నుంచి కృష్ణానగర్ వరకు ఈ వరద నీటి కాలువపై వ్యాపారాలకు, నివాసాలకు సంబంధించిన ర్యాంపులు, మెట్లు ఆక్రమణలతో నాలా మూసుకుపోవడంతో పూడికతీత కష్టసాధ్యంగా మారిపోయింది. దీంతో గత 20 సంవత్సరాలుగా సిల్ట్, మట్టి, ఇతర వ్యర్థాలు పేరుకుపోయిన వాటర్ డ్రైన్ నుంచి వరద ప్రవాహం బయటికి వెళ్లలేక అక్కడే నిలిచిపోతుంది. కృష్ణానగర్ వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పోలీస్ బెటాలియన్ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, పోచమ్మ టెంపుల్ మీదుగా ప్రధాన రహదారి దాటి ఎల్ఎన్నగర్ నాలాలో కలిసేలా బాక్స్ టైప్ డ్రైన్ నిర్మాణం చేపట్టినప్పటికీ ప్రధాన రోడ్డు మార్గం తవ్వకం విషయంలోపై.. మెట్రో రైల్, కింద అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్, వాటర్ లైన్స్ వంటి అడ్డంకులతో పాటు ట్రాఫిక్, ఆర్ అండ్ బీ, ఆర్టీసీ అనుమతుల మూలంగా బాక్స్ డ్రైన్ నిర్మాణం తుది దశలో నిలిచిపోయింది. దీంతో కృష్ణానగర్ వరదనీటి సమస్యకు పరిష్కారం లభించలేదు. ప్రభుత్వం మారిన తర్వాత సమస్య పరిష్కారం కాలేదు సరికదా.. నేతల పాదయాత్రలకు.. శిలాఫలకాల ఆవిష్కరణలకు కృష్ణానగర్ వేదికగా మారిపోయింది.
ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.75 లక్షలతో సివరేజి లైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయగా అదీ రోడ్డు కటింగ్ అనుమతుల కోసం ఆగిపోయింది. దీంతో అటు డ్రైనేజీ, మురుగు నీటితో కలిసిన వరద ప్రవాహం స్థానికులను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తుంది. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ పర్యటించిన నేపథ్యంలో ఇప్పటికైనా అడుగు ముందుకు పడుతుందా? అని స్థానికులు ఎదురు చూస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని నాలాల్లో కలిపే సామర్ధ్యం లేని స్ట్రామ్ వాటర్ డ్రైన్లు పూర్తిగా ప్రక్షాళన చేయనంత కాలం కృష్ణానగర్ వాసుల వరద కష్టాలు తీరేలా లేవు. ఈ దిశగా హైడ్రా అడుగులు వేస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది.