HYDRAA | సిటీబ్యూరో, నవంబర్ 1(నమస్తే తెలంగాణ): హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన బృందంతో కలిసి మరో నాలుగు రోజుల్లో కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీలో పర్యటించనున్నారు. చెరువుల పునరుజ్జీవంపై బెంగళూరులో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించడానికి కమిషనర్ అక్కడికి వెళ్తున్నారు. ఇటీవల రంగనాథ్ లేక్‌మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్మల్లి గవాడ్తో హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఆ సమయంలో బెంగళూరులో చెరువుల పునరుద్ధరణ జరిగిన తీరుపై చర్చించారు. మురుగుతో నిండి, నీళ్లు లేకుండా ఉన్న చెరువులకు ఎలా పునరుజ్జీవం కల్పించారో తెలుసుకున్నారు.
ఈ క్రమంలో బెంగళూరు వెళ్లడానికి హైడ్రా టీమ్ సిద్ధమైంది. బెంగళూరులో చెరువుల పునరుద్ధరణ, మురుగునీరు స్వచ్ఛంగా మార్చిన విధానంపై హైడ్రా కమిషనర్ అక్కడి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. అక్కడ పునరుద్ధరణ జరిగిన చెరువులపై స్టడీ చేసి..ఆ విధానాలను హైదరాబాద్‌లో ఎలా వర్తింపచేయాలో ప్రభుత్వంతో చర్చించనున్నామని హైడ్రా అధికారులు చెబుతున్నారు.
చెరువులు మాత్రమే కాకుండా కొద్దిరోజుల కిందట డిజాస్టర్ మేనేజ్మెంట్పై బెంగళూరు మాజీ డైరెక్టర్‌తో సమావేశమై మేనేజ్మెంట్ విధి విధానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూశారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో చెరువుల పునరుజ్జీవనంపై క్షేత్రస్థాయిలో స్థితిగతులను అధ్యయనం చేయడం, డిజాస్టర్ మేనేజ్మెంట్లో అనుసరించిన విధానాలను పరిశీలించడం కోసం హైడ్రా టీమ్ బెంగళూరు వెళ్లనున్నది. అక్కడ చెరువుల అధ్యయనం తర్వాత బాచుపల్లిలోని ఎర్రగుంట చెరువు, మాదాపూర్‌లోని సున్నంచెరువు, కూకట్‌పల్లిలోని నల్లచెరువు, రాజేంద్రనగర్‌లోని అప్పచెరువులకు పునరుజ్జీవం కల్పించాలని నిర్ణయించారు.
ఒక వర్షం పడితే బెంగళూరులో రహదారులే కాదు.. అపార్ట్మెంట్లకు అపార్ట్మెంట్లే వరదనీటిలో మునిగిపోతున్నాయి. మెట్రో రైళ్లు ఉన్నా కూడా ట్రాఫిక్ సమస్యకు ఇప్పటికీ తెరపడలేదు. బెంగళూరు తరహాలోనే హైదరాబాద్‌లోనూ ట్రాఫిక్ సమస్య ఉంది. హైదరాబాద్‌ను కూడా వరదలు ముంచెత్తాయి. అయితే బెంగళూరు డిజాస్టర్ మేనేజ్మెంట్ నిపుణులతో హైడ్రా అధికారులు సమావేశంపై అందరిలో చర్చ జరుగుతున్నది. అసలు బెంగళూరులో ఉన్న పరిస్థితులకు హైదరాబాద్ స్థితిగతులకు పొంతనే ఉండదని గ్రేటర్‌కు చెందిన పట్టణ విభాగ నిపుణుడు చెప్పారు. టెక్నాలజీ పరంగా అక్కడి సెన్సార్ల వ్యవస్థ బాగానే ఉన్నా.. డిజాస్టర్ పరంగా బెంగళూరు మేనేజ్మెంట్ సక్సెస్ కాలేదని, అసలు హైదరాబాద్‌లో బెంగళూరు సిస్టమే పనిచేయదన్నారు.
హైదరాబాద్‌లో వంద చెరువులపై హైడ్రా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన జాబితాను కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్‌కు అందించారు. ఇందుకు సంబంధించి కొన్ని చెరువులను సీఎస్ఆర్ కింద, మరికొన్ని చెరువులను హెచ్ఎండీఏ నిధులతో అభివృద్ధి చేయనున్నారు. బెంగళూరులో చెరువుల పునరుజ్జీవం ఎలా జరిగిందో అధ్యయనం చేసి ఆ తర్వాత హైదరాబాద్‌లో చర్యలు చేపడుతారని హైడ్రా బృందం చెబుతున్నది.