HYDRAA | సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరంలో ఒకప్పుడు ఉన్న చెరువుల్లో ఇప్పుడు 61 శాతం లేకుండా పోయాయని హైడ్రా అంటోంది. మిగతా 39 శాతం చెరువుల లెక్క తేల్చడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని హైడ్రా అంటున్నది. ఇన్నర్ ఓఆర్ఆర్ హైడ్రా పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న చెరువుల పరిరక్షణకు హైడ్రా పనిచేస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలపై హైడ్రాకు వస్తున్న ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ పరిస్థితులను హైడ్రా సమీక్షిస్తోంది. ఇందులో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు.
ముఖ్యంగా చెరువుల చుట్టుపక్కల ఆక్రమణలపై వస్తున్న ఫిర్యాదులపై విచారణ చేస్తున్నప్పుడు స్థానికులు, అధికారుల నుంచి వస్తున్న అభిప్రాయాలపై హైడ్రా చర్చ జరుపుతున్నది. ప్రధానంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం కుంట, చెరువు కనిపించకపోయినప్పటికీ రికార్డుల్లో మాత్రం ఉంటున్నాయని హైడ్రా అధికారులు చెబుతున్నారు. ఇక సర్వే నంబర్ల మార్పులు, కొన్ని తేడాల వల్ల జల వనరులే లేకుండా పోయాయని, వీటిలో అవకాశమున్న కొన్ని జల వనరులను పునరుద్ధరించే పరిస్థితులపై కూడా ఇరిగేషన్ నిపుణులతో చర్చిస్తున్నారు. ఎక్కడెక్కడ చెరువులు మాయమయ్యాయో తెలుసుకుని వాటి ప్రస్తుత స్థితిగతులను ప్రభుత్వానికి నివేదికగా ఇస్తామని వారు చెబుతున్నారు.
మరోవైపు చెరువుల హద్దుల నిర్ధారణపై కూడా హైడ్రాలో అయోమయం నెలకొంది. ఇప్పటివరకు ఓఆర్ఆర్ పరిధిలో ఏ చెరువుకు కూడా నిర్దిష్టంగా ఎఫ్టీఎల్, బఫర్జోన్ల నిర్ధారణ విషయంలో స్పష్టత లేకపోవడంతో తమ కార్యాచరణ ఎలా కొనసాగించాలో తెలియక హైడ్రా అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. హద్దుల నిర్ధారణ విషయంలో అటు హెచ్ఎండీఏ, ఇటు బల్దియా మరోవైపు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఒక ప్రణాళికతో ముందుకుపోకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తుతున్నదని హైడ్రాలో చర్చ జరుగుతోంది.
అంశాల వారీగా .. బృందాలుగా విచారణ..
హైడ్రా కార్యాలయానికి జలవనరుల విషయంలో ఫిర్యాదులొస్తున్నాయి. సుమారుగా నాలుగువేలకు పైగా ఫిర్యాదులొచ్చాయని హైడ్రా చెబుతున్నది. ఇందులో కొన్ని కుంటలు, చెరువులు మాయమైనవాటిపై ఉన్న ఫిర్యాదులుండగా మరికొన్ని ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో ఆక్రమణలపైనే ఉన్నాయి. మరికొన్ని ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాల ఆక్రమణలపై ఉన్నాయి. అయితే ఫిర్యాదులను అంశాల వారీగా వేరు చేసి బృందాలుగా విచారణ చేస్తున్నారు. ఇందులో మాయమైన చెరువులు, కుంటల ఫిర్యాదులపై వెళ్లినప్పుడు పరిస్థితులు నివేదిక రూపంలో తయారు చేశారు. ప్రస్తుతం ఉన్న వాటి లెక్క తేల్చడం కొంత కష్టమవుతున్నప్పటికీ.. ఉన్న వాటిని పరిరక్షించాలనే పనిచేస్తున్నామని హైడ్రా చెబుతోంది.
హద్దుల నిర్ధారణలో అయోమయం..
హైడ్రా పరిధిలో ఉన్న చెరువుల లెక్క తేల్చే సమయంలో అసలు ఎన్ని చెరువులున్నాయి.. వాటికి ఉన్న హద్దులపై అధికారులు అయోమయానికి గురవుతున్నారు. ముఖ్యంగా హైడ్రా ఇటీవల నిర్వహించిన సదస్సులో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. హైడ్రా రిటైర్డ్ ఇంజినీర్లతో చెరువుల హద్దుల్లో వస్తున్న తేడాలపై చర్చించింది. ఉదాహరణకు అమీన్పూర్ చెరువు విస్తీర్ణం 1949 కెడస్ట్రియల్ మ్యాప్ ప్రకారం 96.8 ఎకరాలు కాగా చెరువు చరిత్ర(మెమొయిర్స్) ప్రకారం 93.37 ఎకరాలు.. సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్ 2005 ఆధారంగా 132.97 ఎకరాలు. 2001 లో చెరువులో నిలిచిన నీటి విస్తీర్ణం 103 ఎకరాలు.. హెచ్ఎండీఏ, ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల సర్వే ప్రకారం 464 ఎకరాలు..ఒక్క అమీన్పూర్ మాత్రమే కాకుండా ఓఆర్ఆర్ లోపల ఉన్న మేజర్ చెరువుల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం విస్తీర్ణం, బఫర్జోన్కు సంబంధించిన వివరాలు ఒక్కో విభాగం రికార్డుల్లో ఒక్కోలా ఉన్నాయి. ఇది చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
అమీన్పూర్ చెరువు విస్తీర్ణం 464 ఎకరాలుగా హెచ్ఎండీఏ, ఇరిగేషన్ విభాగాలు నిర్ణయించగా.. స్థానికులు కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం చెరువులో 400 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నీళ్లు ఉన్నాయి. ఒక్క అమీన్పూర్ చెరువే కాకుండా చాలా చెరువుల పరిస్థితి వేర్వేరుగా ఉందని, ప్రతీ చెరువుకు చరిత్ర ఎంత ఉందో అంతే స్థాయిలో సమస్యలు ఉన్నాయని సమీక్షలో హైడ్రా అధికారులు అన్నట్లు తెలిసింది. చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణలో సమగ్రమైన విధానాలు లేకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని హైడ్రా బృందం భావిస్తోంది. లేక్ ప్రొటెక్షన్ కమిటీ నిర్ణయం మేరకు మైనర్ ఇరిగేషన్ సీఈ 2013లో రూపొందించిన మార్గదర్శకాల ఆధారంగా ఇప్పటివరకు ఎఫ్టీఎల్ నిర్ధారణ జరుగుతోంది. రికార్డుల్లో ఉన్న వివరాలకు భిన్నంగా క్షేత్రస్థాయిలో చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారించాల్సి వస్తోంది. దీంతో న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఎఫ్టీఎల్ నిర్ధారణలోఅలుగు ఎంత కీలకమో, చెరువుల ఆకృతి (కాంటూరు)కూడా అంతే కీలకమని, వ్యర్థాలు, మట్టితో చెరువును నింపితే కాంటూరు మారి ఎఫ్టీఎల్ మారుతుందని ఇంజినీర్లు అభిప్రాయపడ్డారు.