అడ్డగుట్ట, మే 27: చిలకలగూడ దూద్‌బావి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఎట్టకేలకు దారి క్లియరైంది. పాఠశాలకు దారిని ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్‌రెడ్డి సోమవారం సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షకు అధికారులు స్పందించారు. దీంతో అడ్డు గోడను తక్షణమే తొలగించి పాఠశాలకు దారిని ఏర్పాటు చేయాలని హైడ్రా అధికారులకు, టౌన్ ప్లానింగ్ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు మంగళవారం పాఠశాల దారికి అడ్డుగా ఉన్న గోడను తొలగించారు.
విద్యార్థుల కోసమే దీక్ష..
పాఠశాలకు దారి లేకపోవడంతో కొంతకాలంగా విద్యార్థులు పడుతున్న బాధను చూసే సమస్య పరిష్కారానికి ఎలాగైనా ముందడుగు వేయాలన్న సంకల్పంతోనే నిరసన దీక్ష చేపట్టినట్టు హెచ్ఎం మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు. సమస్య పరిష్కారం కోరుతూ గతంలో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు, పాలకులకు పలుమార్లు వినతి పత్రాలను సమర్పించినట్లు తెలిపారు. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సమస్యను పరిష్కారానికి తాను ముందడుగు వేసి దీక్షను చేపట్టినట్లు తెలిపారు.