Operation Musi | సిటీబ్యూరో, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ): గుండెలు రగిలాయి.. ఆగ్రహావేషాలు పెల్లుబికాయి.. ఉప్పెనలా ఆక్రోశం ఎగిసింది. ఈ ప్రజా చైతన్యానికి కాంగ్రెస్ సర్కారు వెన్నులో వణుకు పుట్టింది. మూసీ ఇండ్లపై బుల్డోజర్లు ఏ క్షణమైనా దూసుకురావొచ్చనే హైడ్రా స్పీడుకు బ్రేకులు పడింది. రెడ్ మార్కింగ్ నిలిచిపోయింది… మూడు రోజుల నుంచి మూసీ నిర్వాసితుల ఆందోళనలు.. ఎక్కడికక్కడ సర్వే బృందాల అడ్డగింత.. రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం.. మార్కింగ్ వేయకుండా నిలువరించడం.. చావడానికైనా సిద్ధపడటం వంటి ఘటనలతో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిన అనివార్యత ఏర్పడింది.
మూసీ నిర్వాసితుల తెగింపు చూసిన హైడ్రా, రెవెన్యూ, పోలీసు అధికారులు కూల్చివేతలు ప్రస్తుత పరిస్థితుల్లో కుదరవని ప్రభుత్వ పెద్దలకు తెలియజేసినట్టు సమాచారం. దీంతో చేసేదేమీ లేక ఇప్పటికే వచ్చిన బుల్డోజర్లు వెనక్కి వెళ్లాల్సిన దుస్థితి. అయితే, ఈ డ్యామేజీని కంట్రోల్ చేసుకోవడం కోసం రేవంత్ సర్కార్ మరో నాటకానికి తెరతీసింది. ఇప్పట్లో కూల్చివేతలు లేవంటూ.. నిర్వాసితులను ఒప్పించి అందరికీ డబుల్ బెడ్రూంలు కేటాయించిన తర్వాతే కూల్చివేతల గురించి ఆలోచిస్తామని హైడ్రా, మున్సిపల్ శాఖ అధికారులు శనివారం మీడియా సమావేశం నిర్వహించి ప్రకటించడం గమనార్హం. ఎవరిని బలవంతంగా ఖాళీ చేయించబోమని.. అందరికీ న్యాయం చేశాకే.. మూసీ ప్రాజెక్టుపై ముందుకెళ్తామని చెప్పక తప్పని పరిస్థితి వచ్చింది.
అధికారులు మొదట యుద్ధ జపం.. ఇప్పుడు శాంతి జపం చేస్తున్నారు. మూసీ నిర్వాసితుల ఇండ్లను కూల్చేస్తామంటూ సర్వే బృందాలు రెడ్ మార్కింగ్ ప్రక్రియతో హడలెత్తించారు. ఇక మీ ఇండ్లు భూస్థాపితం అవ్వబోతున్నాయనేలా భయోత్పాత వాతావరణాన్ని సృష్టించారు. పోలీసుల ఓవరాక్షన్ పలువురు బాధితులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.
అయితే, అధికారుల తీరును మూసీ నిర్వాసితులు ఎండగట్టారు.. వారిని నిలదీశారు. దీంతో మూడో రోజు సర్వేకు వచ్చిన బృందాలు రెడ్ మార్కింగ్ ప్రక్రియను ఆపేశారు. శనివారం జరిగిన సర్వేలో అధికారులు మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటించి డబుల్ బెడ్రూమ్లకు వెళ్లాలనుకునే వారిని గుర్తించి వారికి పట్టాలు అందించడంపై దృష్టి సారించారు. ఇందులో అధిక సంఖ్యలో బాధితులు తమ ఇండ్లను వదిలేదే లేదని, తమకు డబుల్ బెడ్రూం ఇండ్లు అక్కర్లేదని తేల్చి చెబుతున్నట్టు ఓ సర్వే అధికారి తెలిపారు. ఆసక్తి ఉన్న వారి వివరాలు మాత్రమే తీసుకుంటున్నామని చెప్పారు.
రెడ్ మార్క్ నిలిచిపోవడంతో నిర్వాసితులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. కాగా, మూసీ ప్రాంతాల్లో ఏండ్లుగా ఉన్న వారిని తప్పించడం ప్రభుత్వానికి కత్తి మీద సాము అని చెబుతున్నారు. వారిని ఒప్పించడానికి సామాజిక కార్యకర్తలను, ఎన్జీఓ సంస్థలను, ఉపాధి కల్పించే సంస్థలను రంగంలోకి దింపుతున్నట్టు అధికారులు చెప్పారు. అయితే, ఇవేమీ వారిని ప్రభావితం చేయలేవని రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. మొత్తంగా మూసీ కూల్చివేతలు ఇప్పట్లో లేనట్టేననే సంకేతాలు అధికారులు ఇవ్వడం కొసమెరుపు.
పదేండ్ల కిందట నేను నా భర్త లేబర్ పని చేస్తూ.. స్థలం కొని 70 గజాల్లో రెండంతస్తుల ఇల్లు కట్టుకొని ఉంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వం మా ఇంటిని పడగొట్టడం అంటే.. మాకు మరణంతో సమానం. ఇన్నేండ్లుగా కష్టపడి కట్టుకున్న ఇల్లు ఎలా వదులుకుంటాం. నా ముగ్గురు పిల్లలతో డబుల్ బెడ్రూంలో ఎలా ఉండాలి. మా ఇంటికి తగ్గ నష్ట పరిహారం ఇవ్వాలి. లేదా మరో ప్రాంతంలో గృహాన్ని కేటాయించాలి.
– దీపిక, దరియాబాగ్ నివాసి.
కేసీఆర్ సార్ దయతో మాకు షాదీ ముబారక్, రెండు వేల పింఛన్లు, ఉచితంగా రేషన్ బియ్యం వంటి అనేకం ఇచ్చారు. పిల్లి గుడిసెల్లోని మా సొంత ఇంటి జాగాల్లో డబుల్ ఇండ్లు కట్టించి ఇచ్చిండ్రు. ఇప్పుడు బయటోళ్లకు ఇండ్లు ఎట్లిస్తరు. కేసీఆర్ సార్ లేకపోవడంతో రేవంత్‌రెడ్డి మాలాంటి పేదోళ్లకు దక్కాల్సిన ఇండ్లను దక్కకుండా చేస్తుండ్రు.
– అమీనా బీ, చంచల్‌గూడ
డబుల్ బెడ్రూం ఇంటి కోసం దరఖాస్తు చేసి చాలా ఏండ్లయింది. పిల్లి గుడిసెల డబుల్ బెడ్రూం ఇండ్లను ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పటడంతో ఎంతో ఆశతో ఉన్నాం. కానీ, మూసీ నిర్వాసితులకు ఇండ్లు ఇవ్వడం చాలా బాధగా ఉంది. మేం ఇన్ని రోజులుగా పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. కొంత మందికే ఇండ్లు ఇవ్వడం ఎంత వరకు కరెక్ట్? ఇస్తే అందరికీ ఇవ్వాలి. కూలీ, నాలీ పనులు చేసుకునే మాలాంటి వాళ్లకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది.
– మహ్మద్ షాదాదా ఖురేషీ, (శంకర్‌నగర్)
200 గజాల ఇల్లు తీసుకొని ఒక్క డబుల్ బెడ్రూం ఇచ్చారు. నాకు ముగ్గురు కూతుళ్ళు, ఒక కొడుకు, అందరం కూలీ పని చేసుకొని బతుకుతున్నాం. మేమంతా కష్టపడి 200 గజాల స్థలం కొని అందులో గుడిసెలు వేసుకొని దాదాపు 15 ఏండ్లుగా జీవిస్తున్నాము. ఇప్పుడు అధికారులు వచ్చి మాఇంటికి గుర్తులు వేసి పొమ్మంటున్నారు. పది మంది కుటుంబం ఉన్న మాకు ఒక్క డబుల్ బెడ్రూం ఎలా సరిపోతుంది?
– జయమ్మ, మూసీ నిర్వాసితురాలు.
నేను 25 ఏండ్లుగా ఈ ప్రాంతంలో ఉంటున్నాను. నాతో పాటు మొత్తం ముగ్గురు అన్నదమ్ములం. అందరం కలిసి 100 గజాల ఇల్లు కట్టుకొని అందులో బతుకుతూ ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నాం. ఇపుడు ప్రభుత్వం మమ్మల్ని బలవంతంగా పంపేసి డబుల్ బెడ్రూం ఒక్కటి ఇస్తే మా మూడు కుటుంబాలకు ఎలా సరిపోతుంది?
-ఎం.బాబురావు, దరియాబాగ్
ఇంటి అద్దెలు కట్టలేక పోతున్నం. డబుల్ బెడ్ రూం ఇండ్లు వస్తే కష్టాలు తీరుతాయని అనుకున్నం. కానీ, మా కండ్ల ముందే బయట వాళ్లకు అధికారులు ఇండ్లు ఇస్తున్నరు. కూలీ నాలీ పనులు చేసుకొని జీవిస్తున్న పేదోళ్లకు ఇండ్లు ఇస్తరని ప్రభుత్వం చెప్పటంతో దరఖాస్తు చేసుకున్నం. మా కాగితాలను అధికారులకు చూపించే అవకాశం లేదు. పోలీసులు మాకు అధికారులను కలిసే అవకాశం ఇవ్వటం లేదు. మాకు ఇండ్లు ఇస్తమని భరోసా ఇచ్చే వారు ఎవ్వరు లేరు.
– పైమిదా, మాదన్నపేట
ఎన్నో రోజులుగా పిల్లి గుడిసెల డబుల్ బెడ్ ఇండ్లలో మాకు ఇల్లు వస్తుందని ఎంతో ఆశతో ఉన్నం. ఇప్పడు హైడ్రా బాధితులంటూ మూసీ నిర్వాసితులను ఇక్కడి తెచ్చి ఇండ్లు ఇవ్వటం సరికాదు. స్థానికంగా ఉండే మేము ఎక్కడికి వెళ్లాలి? ఇన్ని రోజులు ఇండ్లు వస్తాయని ఆశతో బతికినం. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి? ఇంటి కోసం దరఖాస్తు చేసుకొని ఏండ్లు దాటింది. మేం ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి? మా పరిస్థితిపై ప్రభుత్వం అలోచించి తగు నిర్ణయం తీసుకోవాలి.
– సలేహ బేగం, చావునీ
కార్వాన్ దరియాబాగ్‌లో 12 ఏండ్ల కిందట 80 గజాల్లో ఇల్లు నిర్మించుకున్నా. నా భార్య పూజా, ముగ్గురు పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తున్న సమయంలో యమపాశంలా అధికారులు వచ్చి మా ఇంటికి మార్క్ వేసి వెళ్లిపోవడం అన్యాయం. నేను ఎనిమిదేండ్లు సౌదీలో ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఈ ప్రాంతంలో స్థలం కొని రెండంతస్తుల భవనాన్ని కట్టుకున్నా. ఇప్పుడు మా ఇల్లు లాక్కొని డబుల్ బెడ్రూం ఇస్తాం.. వెళ్లిపోండి.. అని అంటే మేము ఎంతో ఆశపడి కట్టుకున్న ఇల్లును ఎలా వదులుకోవాలి. డబుల్ బెడ్రూం మాకెందుకు, మా ఇల్లు మాకివ్వండి.
– మహేందర్, పూజా దంపతులు