సిటీబ్యూరో, ఆగస్ట్ 26 (నమస్తే తెలంగాణ): గతంలో అక్కడ నాలా ఉండేది.. కానీ ఇప్పుడు అక్కడ నాలా లేదు. ఆ నాలా స్థలం ప్రస్తుతం ఆక్రమణకు గురైంది. హైడ్రా వచ్చి ప్రభుత్వ స్థలాలను కాపాడతానంటూ చెప్పి ఈ ఆక్రమణలపై మాత్రం అడుగు వేయడం లేదు. ఫిర్యాదు చేసిన తర్వాత హైడ్రా అధికారులు వచ్చి వెళ్లి ఆక్రమణలన్నారే తప్ప చర్యలకు మాత్రం ముందడుగు వేయడం లేదు. దీని వెనుక ఏం జరుగుతుంది.. ఇదంతా హైడ్రా కమిషనర్‌కు తెలిసే జరుగుతుందా.. ప్రస్తుతం గుడిమల్కాపూర్ స్థానికుల్లో జరుగుతున్న చర్చ ఇది.
గుడిమల్కాపూర్‌లోని టీఎస్6/1,16,27,28లో ఉన్న నాలా ప్రస్తుతం మనుగడలో లేదు. గతంలో ఉన్న బావి నాలా క్రమక్రమంగా మనుగడ కోల్పోగా దానికి కొంచెం ముందు డ్రైనేజీ నాలా నిర్మించారు. ఇదంతా ముప్ఫై ఏళ్ల క్రితం జరిగింది. ఆ తర్వాత కొత్త నాలాకు సంబంధించి భూ సేకరణ కూడా చేపట్టారు.
అయితే పాతలో ఉన్న బావి నాలా మాత్రం నీరులేక పూర్తిగా ఎండిపోయింది. హైడ్రా వచ్చిన తరవాత ఎక్కడా ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, చెరువుల, నాలాలను ఆక్రమించడాన్ని సీరియస్‌గా తీసుకుని అక్కడ ఉన్న కమర్షియల్ నిర్మాణాలను తొలగిస్తూ పోతోంది. కానీ ఈ నాలా ఆక్రమణలపై మాత్రం హైడ్రా తీరే భిన్నంగా ఉంది. కమిషనర్ రంగనాథ్ నాలాలపై ఆక్రమణలు తొలగిస్తాం.. ప్రభుత్వ స్థలాల్లో తాము వచ్చిన తర్వాత నిర్మాణాలు చేపడితే ఊరుకోం అంటూ పలు వేదికలపై చెబుతున్నా.. ఇలాంటి పెద్ద పెద్ద నిర్మాణాలేవీ కమిషనర్‌కు కనిపించడం లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
హైడ్రా తీరుపై ఆరోపణలు..
గుడిమల్కాపూర్ వద్ద నాలా ఆక్రమణకు సంబంధించి ఈ సంవత్సరం జనవరిలో స్థానికులు ఫిర్యాదు చేశారు. పలు సర్వే నెంబర్లలో నాలా ఆక్రమణకు గురవుతున్నదని, సుమారు ఎకరంన్నరవరకు మహావీర్ అనే నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేపట్టిందని ఫిర్యాదు దారుడు పేర్కొన్నాడు. జనవరి 20వ తేదీన ఇచ్చిన ఈ ఫిర్యాదుకు నెంబర్ ఇచ్చి ఆక్రమణపై విచారణ చేపట్టాల్సిందిగా హైడ్రా అధికారి సుజిత్‌కు కేటాయించారు. అతడు వచ్చాడు. క్షేత్రస్థాయి పరిశీలన చేశాడు.
ఆ తర్వాత మహావీర్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులతో మాట్లాడారు. వారు నిర్మాణం చేస్తున్న నేపథ్యంలో ఆక్రమణలపై ప్రశ్నించగా తాము నిర్మాణం పూర్తి కాగానే కాంపౌండ్‌వాల్, ఇతర ఆక్రమణలన్నీ తొలగిస్తామని రాతపూర్వకంగా రాసి ఇచ్చినట్లు ఫిర్యాదుదారుడుకు సుజిత్ చెప్పినట్లుగా హైడ్రాకు ఫిర్యాదు చేసిన భరత్‌రాజ్ చెప్పారు. ఆ తర్వాత ఎలాంటి చర్యలు లేవు. ఈలోగా వాళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. హైడ్రా అధికారులు మారారు. సుజిత్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అతడిని హైడ్రా నుంచి పంపించేసినట్లు సమాచారం. అతడు బయటకు వెళ్లే సమయంలో మహావీర్ వాళ్లు రాసిచ్చిన డాక్యుమెంట్లన్నీ మాయమైనట్లుగా తెలుస్తోంది.
రెవెన్యూ నివేదిక కోసం..
హైడ్రాలో ప్రస్తుతం వచ్చిన అధికారులు ఈ ఆక్రమణలపై మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ డ్రోన్‌తో ఆక్రమణలు ఎక్కడెక్కడున్నాయో చూశారు. అయితే రెవెన్యూ అధికారుల నివేదిక ఇస్తేనే తామేదైనా చేసే అవకాశముంటుందని హైడ్రా అధికారి నర్సింహులు చెప్పారు. అయితే తాను ఈ ఫిర్యాదును సుజిత్ నుంచి తీసుకున్నప్పుడు అందులో మహావీర్ వాళ్లు రాసిచ్చిన డాక్యుమెంట్లు ఏవీ లేవని ఆయన స్పష్టం చేశారు. రెవెన్యూ నివేదిక వచ్చిన తర్వాత ఆక్రమణలపై నిగ్గు తేల్చి కమిషనర్ చెప్పిన విధంగా చేస్తామని నర్సింహులు చెప్పారు.
ఈ విషయంపై ఆసిఫ్‌నగర్ తహసీల్దార్ జ్యోతిని సంప్రదించగా తమ రికార్డుల్లో ఆ ప్రాంతం జినాలా అని ఉందని, అంటే ప్రభుత్వ నాలానే అని, హైడ్రాకు నివేదిక పంపించామని పేర్కొన్నారు. ఈ రెండు శాఖలు ఒకరి కోసం ఒకరు చర్యలకు వెనకాడుతున్నట్లు కనిపిస్తున్నా.. ఆ నిర్మాణాలన్నీ ఆక్రమణలేనని స్థానికంగా ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్న వారు చెప్పారు. అయితే రెవెన్యూ నివేదిక ఆధారంగా హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ప్రస్తుతం గుడిమల్కాపూర్‌లో చర్చనీయాంశమైంది.