సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): నగరంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవీ గ్రూప్ ఆక్రమణలపై హైడ్రా ఎట్టకేలకు కొరడా ఝుళింపించింది. వాసవీ సరోవర్ పేరిట వేల కోట్ల ప్రాజెక్టును నిర్మించేందుకు ఏకంగా చెరువులపై కన్నేసింది. దాదాపు 17 వెడల్పు ఉండేలా బఫర్ విడిచి పెట్టకుండా చెరువు కింద వచ్చే వరద కాలువను పూడ్చివేసింది. ఇన్నాళ్లు ఆక్రమణలు లేవంటూ బుకాయించిన సదరు సంస్థ బాగోతాలపై చర్యలు తీసుకున్నారు అధికారులు.
సదరు సంస్థ నాలాలు, వరద కాలువలు కబ్జా చేసి భారీ భవంతులను నిర్మించడంతో.. స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం ఆయా నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భరత్ నగర్-ఖైతలాపూర్ మార్గంలోని కాముని చెరువు, మైసమ్మ చెరువును కలుపుతూ సాగే వరద కాలువను కబ్జా చేసి నీటి ప్రవాహాన్ని అడ్డుకుని దాదాపు 17 మీటర్ల వెడల్పుతోపాటు, ఇరువైపులా 9 మీటర్ల చొప్పున బఫర్ విడిచి పెట్టకుండా నిబంధనలను అతిక్రమించింది వాసవీ గ్రూప్ సంస్థ.
హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలోని ముల్లకత్వ చెరువు, కాముని చెరువు, మైసమ్మ చెరువులను కలుపుతూ వెళ్లే వరద కాలువలో మట్టి పోసినట్లుగా అధికారులు గుర్తించారు. నిర్మాణ సంస్థపై కేసు పెట్టాలని హైడ్రా కమిషనర్ అధికారులను ఆదేశించగా.. నాలా ఆక్రమణలను వెంటనే తొలగించాలనే ఆదేశంతో.. యుద్ధ ప్రాతిపదికన హైడ్రా అధికారులు జేసీబీలు, టిప్పర్లతో మట్టిని తరలించారు.
ఆ మట్టిని వాసవీ నిర్మాణ సంస్థకు చెందిన స్థలంలోనే పడేయగా.. వరద కాలువ ఆక్రమణలపై వాసవీ గ్రూప్ నిర్మాణ సంస్థపై కూకట్పల్లి పీఎస్‌లో ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఇరువైపులా ఉన్న రిటైనింగ్ వాల్‌తో నిర్మించిన కాలువ మధ్యలో స్లాబ్ వేసేందుకు ఉద్దేశించిన పిల్లర్లను కూడా తొలగించాలని సదరు సంస్థకు అధికారులు సూచించారు.