సిటీబ్యూరో, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ): గ్రేటర్ శివారులో ఉన్న దుండిగల్ మున్సిపాలిటీ పరిధి.. బహదూర్‌పల్లిలోని బాబాఖాన్ కుంట వద్ద హైడ్రా అధికారులు సర్వే నిర్వహించారు. కుంట నుంచి వెలువడే మిగులు జలాలు నాలాలకు ప్రవహించి అక్కడినుంచి నేరుగా ఇతర చెరువుల్లోకి వెళ్లాలి. కానీ ప్రస్తుతం అలా జరగడం లేదు. నాలాలు పూర్తిగా కబ్జాకు గురవడంతో ఈ మిగులు జలాలన్నీ కాలనీవాసుల ఇళ్లలోకి వస్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో వీరు హైడ్రాను సంప్రదించారు. తమ ప్రాంతంలో మిగులు జలాలు ప్రవహించే నాలాలు పూర్తిగా కబ్జాకు గురవడంతో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీనిపై సర్వే చేసి తమకు న్యాయం చేయాలని హైడ్రాను కోరారు. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారుల బృందం బాబాఖాన్కుంట వద్ద సర్వే నిర్వహించింది. ఇందుకు సంబంధించి ఇరిగేషన్ అధికారుల నుంచి కూడా నివేదిక కోరింది. త్వరలోనే ఇరిగేషన్ ఇచ్చే నివేదికతో పాటు మున్సిపల్ రికార్డులను పరిశీలించి హైడ్రా ఒక నిర్ణయం తీసుకోబోతోంది. బహదూర్‌పల్లి ప్రస్తుతం విలీన గ్రామం కావడంతో ఇక్కడి రికార్డులన్నీ మున్సిపల్ వద్దకు చేరాయి.
ఇటీవల విలీన గ్రామాలన్నీ హైడ్రా పరిధిలోకి రావడంతో నాలాల ఆక్రమణలకు సంబంధించి స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అర్బనైజేషన్ కాకముందు ఈ కుంట నిండితే అలుగు పారగానే తూము ఓపెన్ చేసి పంటకాల్వల ద్వారా నీటిని మళ్లించేవారు. కానీ క్రమక్రమంగా విల్లాలు, వెంచర్లు వచ్చి ప్రస్తుతం విలీనం కాకముందే ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందడంతో కుంటనీరు ఎటు మళ్లించాలో తెలియని పరిస్థితి వచ్చింది. నాలాలు ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నప్పటికీ.. అక్కడ ఉన్న స్థానిక రాజకీయ కారణాల వల్ల ప్రస్తుతం అధికారులకు ఇబ్బందిగా మారుతోంది.
గ్రేటర్ శివారులోని బాబాఖాన్కుంట నుంచి వెలువడే మిగులు జలాలు ప్రవహించే నాలాలు కబ్జాకు గురయ్యాయని, వాటి ఆక్రమణలను తొలగించాలని బహదూర్‌పల్లి వాసులు హైడ్రాను డిమాండ్ చేస్తున్నారు. బాబాఖాన్ కుంట నిండిన తర్వాత మిగులు జలాలు వెళ్లేందుకు నాలాలు లేకపోవడంతో అక్కడి కాలనీలు వర్షాకాలంలో మునిగిపోతున్నాయని, వరదలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని దుండిగల్ మండల పరిధిలోని బాబాఖాన్ కుంట నుంచి రెండు ప్రధాన నాలాలు ఉన్నాయి. చెరువు నిండిన తర్వాత ఆ నీరంతా అలుగు నుంచి ఈ నాలాల ద్వారా ఇతర చెరువుల్లోకి వెళ్లేవి. కానీ ఇప్పుడు చెరువు నిండితే చాలు.. నాలాలు లేకపోవడంతో అక్కడి కాలనీలు, చెరువు ఎఫ్టీఎల్ అనంతరం ఏర్పడిన కాలనీలు ముంపునకు గురై స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
బాబాఖాన్ కుంట నుంచి ఒక నాలా అలుగు నుంచి బయలుదేరి అనంతరం రెండుగా విడిపోతుందని, విడిపోయిన నాలాలోని ఒక పాయ సర్వే నంబర్ 208,179,180ల మీదుగా వెళ్తుందని, వాటిని కొందరు ఆక్రమించుకుని తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా స్పందించి బాబాఖాన్ కుంట నాలాలను పరిరక్షించాలని,ఆక్రమణలను తొలగించాలని కోరుతున్నారు. నాలాలను హైడ్రా పునరుద్ధరిస్తే వాటి వెంట ఉన్న కాలనీలను కాపాడినట్లవుతుందని అభిప్రాయపడుతున్నారు.