HYDRA | కేపీహెచ్‌బీ కాలనీ, ఏప్రిల్ 13: కూకట్పల్లి నల్లచెరువు సుందరీకరణ పేరుతో హడావుడి చేస్తున్న హైడ్రా అధికారుల తీరుతో ఆ ప్రాంతంలో వారసత్వ హక్కులు కలిగిన రైతులు ఆందోళన చెందుతున్నారు. కూకట్పల్లి గ్రామంలోని సర్వే నంబర్లు 27 నుంచి 80 వరకు సుమారు 20 ఎకరాలలో నల్లచెరువు విస్తీర్ణం ఉంది.
దీనిలో కేవలం 7.38 ఎకరాలు మాత్రమే చెరువుకు సంబంధించినది కాగా మిగిలిన భూమి మొత్తం యాజమాన్య హక్కులు కలిగిన పట్టా భూములే. ఈ భూముల్లో అనాదిగా రైతులు వ్యవసాయం చేస్తూ జీవనాన్ని సాగించారు. పట్టణీకరణలో భాగంగా ఈ చెరువు పరిసరాల్లో భవన నిర్మాణాలు వెలిశాయి. కాగా ఈ చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్ పరిధి 2010 ఏడాదిలో 19 ఎకరాలుగా తేల్చగా… ప్రస్తుతం 27 ఎకరాలుగా రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాల అధికారులు చెబుతున్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2024 లో ఏర్పడిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) చూపు కూకట్‌పల్లిలోని నల్లచెరువుపై పడింది. ఈ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు వెలిశాయని హడావిడిగా పలు నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో బాధిత రైతులు.. కోర్టు ఆదేశాలను, కోర్టు ధిక్కరణ పిటిషన్ కొనసాగుతున్న విషయాన్ని హైడ్రాధికారులకు సమర్పించడంతో కూల్చివేతల పర్వాన్ని హైడ్రా తాత్కాలికంగా నిలిపివేసింది.
సుందరీకరణ పేరుతో….
అయితే నల్ల చెరువు సుందరీకరణ కోసం ప్రభుత్వం రూ.9కోట్లు కేటాయించగా అధికారులు సుందరీకరణ పనులను ఇప్పటికే ప్రారంభించారు. చెరువులోని నీటిని పూర్తిగా తొలగించి పూడికతీత పనులను చేపట్టారు. ఈ క్రమంలో బాధిత రైతులు మరోసారి పనులను అడ్డుకొని నిరసన తెలిపారు. నల్ల చెరువు విస్తీర్ణం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధులు శాస్త్రీయబద్ధంగా లేదని.. మరోసారి సర్వే నిర్వహించి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలని హైడ్రా అధికారులను వేడుకున్నారు.
అలాగే చెరువు సుందరీకరణ పనులు చేపట్టే ముందు బాధిత రైతులకు చట్టప్రకారం నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. హైకోర్టు సూచనలకు విరుద్ధంగా బాధితులకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా హడావిడిగా పనులు చేపట్టడంపై బాధిత రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయబద్ధమైన సర్వే లేకుండా చెరువు సుందరీకరణకు తమ పట్టా భూములను ఎలా ఇస్తామని ప్రశ్నించడంతో హైడ్రా అధికారులు వెనుదిరిగారు.
హామీ ఇచ్చినప్పటికీ..
గతంలో హైడ్రా కమిషనర్‌ను కలిస్తే… బాధిత రైతులకు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే పనులు చేస్తామని చెప్పారని దీనికి తాము కూడా అంగీకరించినట్లు తెలిపారు.అయితే మరోసారి గత శుక్రవారం అధికారులు చెరువును పరిశీలించి వెళ్లడంతో ఎప్పుడు ఏం చేస్తారో అనే భయం తమను వెంటాడుతోందని బాధిత రైతులు చంద్రశేఖర రావు హనుమంతరావు, సుధాకర్ రావు, సీహెచ్ నర్సింహరావు, ఎం.మధుసూదన్ రావు, ఎం నర్సింహ రావు, చౌదరి నర్సింగరావు, సీహెచ్ లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరిహారం ఇచ్చాకే పనులు చేపట్టాలి
నల్ల చెరువు సుందరీకరణ కోసం స్పష్టమైన ప్రణాళిక లేకుండా హైడ్రా అధికారులు పనులు ఎలా చేపడతారు? చెరువు సుందరీకరణపై స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్‌కు కనీస సమాచారం లేదు. ఇదే విషయమై ఎమ్మెల్యే కృష్ణారావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో మొదలుపెట్టిన బతుకమ్మ కొలను పనులను మధ్యలో ఆపేశారు. నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే సుందరీకరణ పనులు చేపట్టాలి.
– జూపల్లి సత్యనారాయణ, కార్పొరేటర్, కూకట్పల్లి