సిటీబ్యూరో: ఐటీ కారిడార్ కేంద్రమైన సైబర్సిటీపై హైడ్రా ఎఫెక్ట్ పడింది. అక్రమ నిర్మాణాలు, చెరువుల కబ్జాలంటూ హైడ్రా కూల్చివేతలతో దడ పుట్టించడంతో సైబర్ సిటీతో పాటు ఎక్కడైతే చెరువులు తదితర జల వనరులు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ప్రధానంగా హైడ్రా వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ మందగించింది. దీంతో కొత్త నిర్మాణాలే లేకుండా పోయాయి. ఒకవేళ కొన్ని చోట్ల నిర్మాణాలు మొదలుపెట్టినా హైడ్రా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న భయంతో కొనుగోలుదారులు అటువైపు చూడడమే లేదని తెలుస్తున్నది.
దీంతో కొత్త ఎల్టీఎం కనెక్షన్లు తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. 2024 నవంబర్ వరకు ఉన్న గణాంకాలను 2023తో పోల్చి చూస్తే గ్రేటర్లోని మొత్తం పది సర్కిళ్లలో ఎల్టీఎం కనెక్షన్ల సంఖ్య స్వల్పంగా పెరిగినప్పటికీ.. అందులో ఐదింటిలో తగ్గాయి. బంజారాహిల్స్, హబ్సిగూడ, రాజేంద్రనగర్, సరూర్నగర్, సైబర్సిటీలో తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్, సౌత్, సికింద్రాబాద్, మేడ్చల్, సంగారెడ్డిలలో పెరుగుదల కనిపిస్తున్నది. నాలుగు మీటర్లు దాటితే లో టెన్షన్ మల్టీపుల్ మీటర్లు(ఎల్టీఎం)కింద టీజీఎస్పీడీసీఎల్ విద్యుత్ కనెక్షన్లు జారీ చేస్తుంది. ప్యానల్ బోర్డు ఏర్పాటు చేసి మీటర్లు బిగిస్తుంది. ఈ కనెక్షన్లు 2023లో 12,263 జారీ అవ్వగా, 2024లో 12,537 జారీ అయ్యాయి.
హైడ్రానే కారణం..
సిటీ రియాల్టీ 2024లో స్తబ్దుగా ఉండడానికి హైడ్రా ప్రధాన కారణంగా రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. జూలై వరకు ఎన్నికల మూడ్లో ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా హైడ్రా వచ్చి రియల్ ఎస్టేట్పై తీవ్ర ప్రభావం చూపిందని వారంటున్నారు. ప్రధానంగా హైడ్రా చెరువుల ఆక్రమణలంటూ కూల్చివేతలలో దూకుడుగా వ్యవహరించిన క్రమంలో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఈ క్రమంలో కొత్తగా కొనుగోలుదారులు రాకపోవడం, నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడం, కొత్త నిర్మాణాలు ప్రారంభం కాలేదు. మరోవైపు జీడీపీ వృద్ధి రేటు కూడా సుమారుగా 3 శాతానికి తగ్గింది. దీంతో కొత్త ఇండ్ల నిర్మాణాలు తగ్గిపోయి మీటర్ కనెక్షన్లు తీసుకోలేదని తెలుస్తున్నది. 2022 డిసెంబర్ నుంచి 2023 నవంబర్ వరకు బంజారాహిల్స్లో 225 ఎల్టీఎం కనెక్షన్లు ఉంటే 2023 డిసెంబర్ నుంచి 2024 నవంబర్ వరకు 161 ఉన్నాయి. అదే క్రమంలో రాజేంద్రనగర్లో 924 ఉంటే 916 ఉండగా, సైబర్సిటీలో1638 ఉంటే 1552 ఉన్నాయి. సరూర్నగర్లో 2132 ఉంటే 1965కు తగ్గాయి.