సిటీబ్యూరో: కొర్రెముల గ్రామంలో ఏకశిల లేఔట్లో ఆక్రమణలను సోమవారం హైడ్రా సిబ్బంది తొలగించారు. గతవారం జరిగిన ప్రజావాణిలో ఏకశిల ప్లాట్ల యజమానులు తమ లేఔట్లో రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడాలంటూ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కమిషనర్ రంగనాథ్ లేఔట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. అక్కడి యజమానులతో మాట్లాడారు.
ఆ తర్వాత ఇరుపక్షాల వారిని పిలిచి హైడ్రా కార్యాలయంలో విచారణ జరపడంతో పాటు సంబంధిత పత్రాలను పరిశీలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రహరీ నిర్మించినట్లు హైడ్రా నిర్ధారించిందని, అంతేకాకుండా లేఔట్లో రహదారులు, పార్కులకు ఉద్దేశించిన స్థలాలను కూడా నిర్ధారించాలంటూ అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం హైడ్రా సిబ్బంది ప్రహరీతో పాటు అక్కడ ఆక్రమణలను తొలగించారు.